ఏపీ సీఎం జగన్, అధికార పార్టీ వైసీపీపై ఇప్పటికే నలువైపులా దాడులు జరుగుతున్నాయి. మాటల తూటా లు పేలుతున్నాయి. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె డాక్టర్ సునీతలు యాంటీ క్యాంపెయిన్ చేస్తున్నారు. సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ ఓటమి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రత్యక్షంగా జరుగుతున్న దాడి. దీనినే సీఎం జగన్ ప్రచారంలో చెబుతున్నారు. తనను ఒంటిరిని చేసి.. ఇంత మంది కలిసి పోరాటం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే.. ఈ దాడి ఇక్కడితో ఆగిపోయేలా కనిపించడం లేదు. అంతేకాదు.. వీరితోనే ఆగిపోయేలా కూడా కనిపించలేదు. దీనికి కారణం.. అసలు కథ ముందుండడమే. మరో 30 రోజుల పాటు ప్రచారం చేసుకునే సమయం ఉంది. పైగా.. కీలక పార్టీల్లో ఒకటైన బీజేపీ అసలు ప్రచారమే ప్రారంభించలేదు. బీజేపీ కూడా ఈ నెల ఉగాది తర్వాత.. ఏపీలో ప్రచారం చేయనుంది. ఇక, ఈ పార్టీ తరఫున కేంద్ర మంత్రులు, ప్రధాని, బీజేపీ ఉద్ధండులు రంగంలోకి దిగుతున్నారు. ఇక, అప్పుడు మరింతగా ప్రచారం ఊపందుకోనుంది.
అదేసమయంలో చిన్నా చితకా పార్టీల ప్రచారం కూడా ఇంకా ప్రారంభం కాలేదు. ఎవరు ఎలాంటి ప్రచా రం చేసినా.. జగన్ కేంద్రంగానే ఆయనకు వ్యతిరేకంగానే చేయనున్నారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అంటే.. మొత్తంగా మరికొన్ని పార్టీలు కూడా.. ఈ యాంటీ ప్రచారాన్ని మరింత వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువెళ్లనున్నాయనేది తెలుస్తోంది. ఇది కూడా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు.. మేధావులు, సమాజాన్ని ప్రభావితం చేయగల వ్యక్తులు వంటివారు కూడా రంగంలోకి దిగనున్నారు.
మేధావులు ఇప్పటికే జగన్‌కు, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇది చాపకింద నీరులా ముందుకు సాగుతోంది. ఇక, ప్రభావిత వ్యక్తుల విషయానికి వస్తే.. లోక్‌సత్తా కన్వీనర్ జేపీ.. జయ ప్రకాశ్ నారాయణ హైదరాబాద్‌లో కూర్చుని జగన్‌కు యాంటీ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఎన్నికల వ్యూహ కర్త.. ప్రశాంత్ కిశోర్ కూడా ఇప్పటికి రెండు సార్లు గళం విప్పారు.
ఆయన ఇక వారానికి ఒకసారైనా మీడియాముందుకు వచ్చి.. జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నా రు. అదేవిధంగా మాజీన్యాయమూర్తులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా.. మీడియా ముందుకు వచ్చేందు కు రెడీ అవుతున్నారు. ఇలా.. మొత్తంగా చూస్తే.. జగన్‌పై ఇప్పుడు జరుగుతున్న దాడి కేవలం పావలా వంతే ముప్పావలా వంతు ముందుందని అంటున్నారు పరిశీలకులు. అయితే.. వీటన్నింటి తట్టుకుని నిలబడితే మాత్రం జగన్ అతి పెద్ద రికార్డును సొంతం చేసుకోవడం ఖాయం. అది కూడా 2009లో వైఎస్‌ను మించిన రికార్డును ఆయన సొంతం చేసుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు పరిశీలకులు.