సమయానికి తగ్గట్లు ఇట్టే స్పందించటం మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సొంతం. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. తన చుట్టూ జరిగే పరిణామాల మీద ఆయన స్పందించే తీరుకు భారీ ఫ్యాన్ క్లబ్ ఉంది. తాను పోస్టు చేసే ప్రతి పోస్టుతో అంతకంతకూ మైలేజ్ పెంచుకుంటూ పోయే ఆనంద్ మహీంద్రా తాజాగా మరోసారి తన పోస్టుతో మనసు దోచేశారు. మూడు రోజుల క్రితం కోతుల దాడి నుంచి ఒక బాలిక తన చిన్నారి మేనకోడల్ని రక్షించటం.. ఇందుకు ఇంట్లోని అలెక్సా ను వాడటం తెలిసిందే.
ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాకు చెందిన నికిత.. తన పదిహేను నెలల మేనకోడలు వామికను తెలివిగా రక్షించిన సంగతి తెలిసిందే. పెద్దవాళ్లు లేని వేళ.. ఇంట్లోకి కోతులు ప్రవేశించిన వేళ.. చిన్నారి మేనకోడలి వైపు కోతులు వెళుతున్న వైనంతో భయపడకుండా.. ఇంట్లోని అలెక్సాను కుక్కలు మొరిగినట్లుగా సౌండ్ చేయాలని 13 ఏళ్ల బాలిక (నికిత) కమాండ్ ఇవ్వటం..అందుకు తగ్గట్లే అలెక్సా స్పందించటంతో భయపడిన కోతులు ఇంట్లో నుంచి పారిపోవటం తెలిసిందే. ఈ ఉదంతానికి సంబంధించి అన్నీ మీడియా సంస్థలు పెద్ద ఎత్తున కవర్ చేశాయి. ఇదే అంశంపై తాజాగా ఆనంద్ మహీంద్రా రియాక్టు అయ్యారు.
ఆ బాలిక వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోందన్న ఆయన.. తన విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఎప్పుడైనా కార్పొరేట్ ప్రపంచంలోని పని చేయాలని నిర్ణయించుకుంటే తాము మహీంద్రా రైజ్ లో చేరమని ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదే పోస్టులో ఆయన.. టెక్నాలజీకి మనం బానిసలుగా ఉంటామా? మాస్టర్లుగానే ఉంటామా? అనేది పెద్ద ప్రశ్న అని.. తాజా ఉదంతంలో బాలిక సమయస్ఫూర్తి చూసిన తర్వాత సాంకేతికత ఎప్పటికీ మానవుడి కమాండ్లను పాటించేదే అన్న ఆశాభావం కలిగిస్తుందని పేర్కొన్నారు.
ఆనంద్ మహీంద్రా పోస్టుకు స్పందించిన నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్టు అవుతున్నారు. కచ్ఛితంగా తాము మాస్టర్లుగానే ఉంటామని పేర్కొనగా.. మరొకరు ఆమెకు వచ్చిన ఐడియా అద్భుతమని..నేటితరం పిల్లలు తెలివితేటలు మన ఊహకు కూడా అందట్లేదని పేర్కొన్నారు.