ఓడిపోయిన చోటే విజయాన్ని వెతుక్కోవాలంటారు పెద్దలు. ఇప్పుడు టీడీపీ యువ నేత నారా లోకేష్ కూడా మంగళగిరిలో అదే చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఓటమి పాలైన ఆయన.. ఈ సారి మాత్రం గెలుపు బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు అన్ని చేసుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు మంగళగిరి నియోజకవర్గంపై లోకేష్‌కు పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. కానీ ఆ ఓటమి తర్వాత ఇక్కడ పూర్తి పట్టు సాధించే దిశగా లోకేష్ కసరత్తులు సాగాయి.
మంగళగిరిపై లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ నియోజకవర్గంలో తనదైన సిస్టమ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ ప్రతి ఒక ఇంటికీ.. ప్రతి మనిషికీ చేరువయేందుకు ప్రయత్నించారు. ఏ శుభకార్యమైన, విషాదమైన లోకేష్ తరపున కచ్చితంగా భరోసా అనేది వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రతి వర్గాన్ని కలుపుకొని సాగుతున్నారు. ఈ సారి కచ్చితంగా గెలవలనే లక్ష్యంతో కష్టపడుతున్నారనే అభిప్రాయాలున్నాయి.
మరోవైపు లోకేష్‌కు అనుకూలంగా పరిస్థితులు మారుతుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను జగన్ పక్కనపెట్టారనే టాక్ ఉంది. టీడీపీ నుంచి గంజి చిరంజీవిని తీసుకుని వాడుకుని వదిలేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్యను లోకేష్‌పై పోటీకి జగన్ నిలబెట్టారు. కానీ లోకేష్ వ్యూహాల ముందు లావణ్య ప్లాన్ పనిచేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో లోకేష్ 50 వేల మెజార్టీతో విజయం సాధించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లోకేష్ కూడా అదే నమ్మకంతో మరింతగా కష్టపడుతున్నారు.