ఏపీ సీఎం జగన్ చేసిన కొన్ని కొన్ని వ్యాఖ్యలు.. ఆయనకే ఎదురు తిరుగుతున్నాయి. “99 మార్కులు వచ్చిన స్టూడెంట్.. పరీక్షలకు భయపడతాడా!“ అంటూ.. ఆయన ఎమ్మిగనూరులో నిర్వహించిన `మేము సైతం సిద్ధం` సభలో ప్రకటించారు. దీనివెనుక జగన్ ఉద్దేశం.. టీడీపీ-బీజేపీ-జనసేనలు కలిసి వచ్చారని.. ఇప్పు డు కఠినమైన ఎన్నికలు జరుగుతున్నాయని.. అయినప్పటికీ తాను ఒంటరిగానే బరిలో నిలుస్తున్నానని.. తన ధైర్యం ఇదీ.. అని జగన్ చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. తాను 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చానని.. కాబట్టి.. తనకే ప్రజాబలం ఉందని జగన్ చెప్పుకొచ్చారు. అయితే.. కీలక నేతలు చేసే వ్యాఖ్యలపై వెంటనే.. నెటిజన్లు కానీ.. రాజకీయ విశ్లేషకులు కానీ.. వెంటనే రియాక్ట్ కావడం కామన్. ఇప్పుడు ఇదే పరిస్థితి సీఎం జగన్ విషయంలో నూ తెరమీదికివచ్చింది. “99 మార్కులు వచ్చిన స్టూడెంట్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలడా?“ అని పలువురు నెటిజన్లు సీఎం జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
ఇవీ ప్రశ్నలు
ప్రత్యేక హోదా: గత ఎన్నికలకు ముందు మెజారిటీ సంఖ్యలో ఎంపీలను ఇస్తే సాదిస్తామన్నారు. ఇప్పు డు ఏమైంది? నాలుగేళ్లుగా ఏం చేశారు?
సీపీఎస్ రద్దు: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్న ఈ హామీని అమలు చేస్తామని గతంలో నే జగన్ చెప్పారు? మరి ఎందుకు అమలు చేయలేదు.
మద్య నిషేధం: మద్యాన్ని నిషేధించిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతానని చెప్పి జగన్.. ఇప్పుడు ఎందుకు ఆ విషయాన్ని మరిచిపోయనట్టు నటిస్తున్నారు?
మూడు రాజధానులు: మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృధ్ది సాధిస్తుందని చెప్పిన జగన్.. ఇప్పుడు మేనిఫెస్టోలో మూడు రాజధానుల అంశం పెట్టగలరా?
ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి 99 పర్సంట్ స్టూడెంట్గారూ! అని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధస్తున్నారు. ఇవన్నీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకు చెందిన సమస్యలేనని వారు చెబుతున్నారు.