రాష్ట్రంలో వలంటీర్లు సర్వస్వం కాదని.. వారితోనే అన్నీ నడవబోవని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “వలంటీర్లు లేనప్పుడు కూడా పింఛన్లు పంపిణీ అయ్యాయి. అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలో సరైన నిష్ఠ, చేయాలన్న ద్రుఢ సంకల్పం ఉంటే.. సముద్రంపై వారధి కూడా కట్టగలరు“ అని హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది
తాజాగా రాష్ట్రంలో పింఛన్లు సహా ఇతర ప్రభుత్వ పథకాల పంపిణీ నుంచి వలంటీర్లను దూరం పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వలంటీర్లు ఆయా పనుల్లో పాల్గొనరాదని ఈసీ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. పెన్షన్లను కూడా వాలంటీర్లు ఇవ్వడానికి వీల్లేదని ఆదేశించింది. దీంతో గుంటూరుకు చెందిన ఓ మహిళ వలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వకపోతే పెన్షనర్లు చాలా ఇబ్బంది పడతారని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. ఎండలు మండిపోతున్నాయని.. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అయితే.. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి పైవిధంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వలంటీర్లు కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. వలంటీర్ల విషయంలో ఈసీ చర్యలను హైకోర్టు సమర్థించింది. పెన్షన్లు వేరే మార్గాల్లో అందించాలంటూ కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు పిటిషన్ ను కొట్టేస్తున్నట్టు తెలిపింది.
ఉద్దేశ పూర్వక ఎగవేత!
మరోవైపు పింఛన్ దారులకు సచివాలయాల వద్ద టెంట్లు, తాగు నీరు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. ఉద్దేశ పూర్వకంగా ఆయా ఏర్పాట్లు చేయలేదని తెలిసింది. దీంతో పింఛను దారులు ఎండలో పడిగాపులు కాస్తున్నారు. తాగునీరు, నీడ లేక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని పలు మండలాల్లో ఇంకా పింఛన్ పంపిణీ ప్రారంభం కాకపోవడం గమనార్హం. దీంతో ఉదయం వచ్చిన వారు ఇంకా అక్కడే పడిగాపులు కాస్తూ.. చంద్రబాబును తిట్టుకుంటున్నారు.