ఏపీలో పెన్షన్ల వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు తప్ప రాష్ట్రంలో వేరే ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు. పెన్షన్లు ఆలస్యం చేసేందుకే కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. మూడో తేదీ నుంచి వారం రోజుళ పాటు పెన్షన్లు ఇస్తామని ఏపీ సిఎస్ చెబుతున్నారని, పెన్షన్ అందుకునేందుకు వారం రోజులు లబ్ధిదారులు ఎందుకు వేచి ఉండాలని ప్రశ్నించారు.
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా పెన్షన్లు ఇవ్వాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. డీబీటీ ద్వారా పెన్షన్లు చెల్లించకుంటే ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. పెన్షన్ వ్యవహారంలో ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఆరోపించారు.
కాగా, ఈసీ నిర్ణయం నేపథ్యంలో మచిలీపట్నం ప్రాంతంలోని వాలంటీర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం మున్సిపల్ కమిషనరేట్ పరిధిలోని వందలాది మంది వాలంటీర్లు తమ రాజీనామాలను సమర్పించారు. తమ సేవలకు రాజకీయాలు ఆపాదిస్తుండటం, ఈసీకి ఫిర్యాదు చేయడం నేపథ్యంలో రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఇక, పత్తికొండ నియోజకవర్గంలో కూడా 16 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. భీమవరంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా వాలంటీర్లు భారీ సంఖ్యలో రాజీనామాలు చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.