కరోనా వైరస్ అరికట్టే నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనుండి బయటకు వస్తే చాలు మూతికి మాస్కు లేకపోతే రూ. వెయ్యి జరిమానా చెల్లించాల్సిందే. ఈ మేరకు ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం ఆ బాధ్యతను పోలీసులకు అప్పగించింది. ఇంకేముంది తమకు ప్రభుత్వం ఇచ్చిన అధికారాలతో పోలీసులు రెచ్చిపోతున్నారు.
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కారణంగా బాధితుల సంఖ్య చాలా వేగంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎంత చెప్పినా సమస్య తీవ్రతను చాలామంది జనాలు పెద్దగా పట్టించుకోవటంలేదు. బంధు, మిత్రులను మనింటికి ఆహ్వానించినట్లే కరోనా వైరస్ ను కూడా మనంతట మనంగా ఆహ్వానిస్తేనే వచ్చి మనల్ని అతుక్కుంటుంది. లేకపోతే మనజోలికి రాదన్న విషయం అందరికీ తెలిసిందే.
వైరస్ ను జనాలు లెక్కచేయకుండా కరోనా నిబంధనలను పాటించటం మానేశారు. మార్కెట్లు, సినిమా హాళ్ళు, కోటి బజార్, ఫ్రూట్ మార్కెట్లలాంటి చోట్ల సామాజిక డిస్టెన్స్ పాటించటం సాధ్యం కాదు. కనీసం మూతికి మాస్కు కూడా పెట్టుకోకపోవటమే అసలు సమస్యగా తయారైంది. దీన్ని ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోవటంలేదు. అయితే సెకెండ్ వేవ్ లో తీవ్రత పెరిగిపోతున్న నేపధ్యంలో ప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది.
కేసుల సంఖ్యను అర్జంటుగా నియంత్రించాలంటే ఇప్పటికిప్పుడు కఠినచర్యలు అమలు చేయటమే మార్గంగా ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే ముందుగా మాస్కును తప్పనిసరి చేసింది. ఒకసారి చెప్పినా విననివారిపై అంటువ్యాధుల నియంత్రణ చట్టం క్రింద కేసులు నమోదుకు కూడా ప్రభుత్వం రెడీఅయిపోయింది. మాస్కు నిబంధన విషయంలో ఏపి, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, ఒడిస్సా, మధ్యప్రదేశ్ లో కూడా తెలంగాణా విధానాన్నే పాటిస్తున్నాయి. మొత్తంమీద మాస్కు విషయంలో ఇప్పటికైనా తెలంగాణా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.