ఏపీలో నారా లోకేష్ .. కేంద్రంలో రాహుల్‌గాంధీ.. ఇద్దరూ కూడా `రెడ్ బుక్` పేరును వాడుతున్నారు. ఏపీలో అయితే.. గత ఏడాది నుంచే నారా లోకేష్ రెడ్‌బుక్ పేరును ప్రస్తావిస్తున్నారు. తనను, తన పార్టీ టీడీపీ నేత లను వేధించే వారిని.. వదిలి పెట్టేది లేదని నారా లోకేష్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తమను వేధించే వారి పేర్లను రెడ్ బుక్‌లో రాసుకుంటున్నట్టు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. రెడ్ బుక్‌లో పేరున్న ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకుంటున్నామని కూడా నారా లోకేష్ పదే పదే చెబుతున్నారు.
అయితే.. తాజాగా ఈ `రెడ్‌బుక్` గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తొలిసారి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపైనా, పార్టీ నేతలపైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులను గుర్తుంచుకుంటామ ని, కేంద్రంలో ప్రభుత్వం మారిన వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని రాహుల్ హెచ్చరించారు. వారి పేర్లు రాసుకుంటున్నామన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ నోటీసులు పంపడం, రూ.1,800 కోట్లు కట్టాలని ఆదేశించడంపై ఆయన మండిపడ్డారు.
“ఉద్దేశపూర్వకంగా, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల మెప్పుకోసం, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న అధికారులపై మా ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటాం. వారి పేర్లు రెడ్ బుక్‌లో రాసుకుంటున్నాం. మరోసారి ఏ అధికారి కూడా ఇలాంటి పనులు చేయకుండా, చేయాలనే ఆలోచన కూడా రానివ్వని రీతిలో చర్యలు తీసుకుంటాం. ఆ అధికారులకు ఇదీ నా గ్యారెంటీ “ అని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
బీజేపీ ఎల్లకాలం అధికారంలో ఉండదని, ఏదో ఒక రోజు ఆ పార్టీ అధికారానికి దూరమవుతుందనే విష యం అధికారులు గుర్తుంచుకోవాలని రాహుల్ అన్నారు. అప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలో చించుకోవాలని హితవు పలికారు.మొత్తంగా ఏపీలో నారా లోకేష్ మాదిరిగా కేంద్రంలో రాహుల్ గాంధీ కూడా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించడం గమనార్హం.