ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కొద్ది రోజుల క్రితం ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు కాకపోవడం, ఆయనను మరికొద్ది రోజులపాటు ఈడీ అధికారుల కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించడం తెలిసిందే. అయితే, తాను జైలు నుంచే పాలన చేస్తానని కేజ్రీవాల్ మొండిపట్టు పట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. జైలులో ఉండి కేజ్రీవాల్ పాలన చేసే విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు చెప్పింది. దీంతో, తాజాగా కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తక్షణమే తప్పించాలని కోరుతూ హిందూ సేన మరో పిటిషన్ దాఖలు చేసింది.
కేజ్రీవాల్‌ను తప్పించేలా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆదేశాలివ్వాలని హిందూ సేన తాను వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పేర్కొంది. లెప్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పాలనా వ్యవహారాలను చూసేలా ఆదేశించాలని సూచించింది. ఓ ముఖ్యమంత్రి జ్యుడిషీయల్ కస్టడీ లేదంటే పోలీస్ కస్టడీలో ఉంటూ పరిపాలన చేసే అవకాశం లేదని హిందూ సేన వాదిస్తోంది. అలా పాలన చేయొచ్చని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా అంటున్నారు. మరి, ఈ పిల్ పై ఢిల్లీ హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.