టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పై టీడీపీ నాయకులు ఇంట్రస్టింగ్ కామెంట్లు చేస్తు న్నారు. ఆయన అర్జునుడి అవతారం ఎత్తారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం నారా లోకేష్‌కు.. మంగళగిరి మాత్రమే కనిపిస్తోందని.. అంటున్నారు. మహాభారతంలో అర్జునుడికి పిట్ట, పిట్టకన్ను మాత్రమే కనిపించి నట్టుగా నారా లోకేష్‌కు మంగళగిరి నియోజకవర్గం మాత్రమే కళ్లముందు కనిపిస్తోందని చెబుతున్నారు. దీనికి కారణం.. నారా లోకేష్ ఇప్పటికే మంగళగిరిలో ప్రచారం ప్రారంభించారు.
అంతేకాదు.. వినూత్న పేర్లతో ఆయన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. “బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్“ కార్యక్ర మాన్ని నియోజకవర్గంలో ధూం ధాంగా నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచే పోటీ చేస్తున్న నారా లోకేష్. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమిని ఈ సారి తట్టుకుని గెలిచి చూపించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఎవరైనా ఓటమి ఎదురైన నియోజకవర్గాన్ని వదలేస్తారు. కానీ, నారా లోకేష్ పట్టుబట్టి మరీ మంగళగిరిలోనే విజయందక్కించుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే. పోటీ కూడా తీవ్రంగానే ఉంది. వైసీపీ వైపు నుంచి బీసీ మహిళ మురుగుడు లావణ్య బరిలో ఉన్నారు. ఈమెకు ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్నారెడ్డి సహా మాజీ మంత్రి మురుగుడు హనుమంత రావు కుటుంబం(సొంత మామ) ఇతర బీసీ నేతలు కూడా అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఇప్పుడు పూర్తిగా మంగళగిరిపైనే దృష్టి పెట్టారు. నియోజకవర్గంలోని ఉన్నతస్థాయి కుటుంబాలను ఆయన కలుస్తున్నారు. అపార్ట్మెంట్లు విల్లాలకు వెళ్లి.. ఉదయాన్నే వారితో చిట్ చాట్ చేస్తున్నారు.
ఒక్కొక్క అపార్ట్‌మెంటలో గంట సేపు చొప్పున రోజుకు రెండు మూడు అపార్ట్మెంట్లలో నారా లోకేష్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 200 మందికి ఉదయాన్ని కమ్మటి టిఫిన్లు పెట్టి.. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. తన వ్యూహాలను వివరిస్తున్నారు. ఇంతకు మించి నారా లోకేష్ వచ్చే 50 రోజులు కూడా మరో షెడ్యూల్ పెట్టుకోవడం లేదని తెలిసింది. అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటించడం లేదని, పూర్తిగా మంగళగిరిపై నే కాన్సన్ట్రేట్ చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.