రాజకీయాలకు ఎలాంటి భిడియం ఉండదు. ఎలాంటి వెనుకంజ కూడా ఉండదు. అప్పటికప్పుడు నాయకులు, పార్టీలు తమ లబ్ధిని చూసుకుని ముందుకు పోవడమే. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది వారికి అనవసరం. ఇదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయం. ఏపీలోనూ ఇదే తరహా రాజకీయాలు సాగుతున్నాయి అయితే. అన్ని పార్టీల్లోనూ కాదు. వైసీపీలో మాత్రమే. ఇక్కడ కొందరు నాయకులు.. చివరి అస్త్రం ప్రయోగిస్తున్నారు. అంటే..తమకు ఇవే చివరి ఎన్నికలని.. తాము ఇకపై పోటీ చేయబోమని.. కాబట్టి..ఈ సారికి గెలిపించమని వేడుకుంటున్నారు.
వాస్తవానికి మిన్ను విరిగి మీద పడినా.. తమకు ఏమీ కాదని చెప్పుకొనే ఈ నాయకులు ఇలా.. జాలి గొలిపి.. సెంటిమెంటు రాజేసే విధంగా రాజకీయాలు చేయడం ఆశ్చర్యం వేస్తుండడం గమనార్హం. వీరిలో మాజి మంత్రి కొడాలి నాని ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఈయన ఎప్పుడు నోరు విప్పినా.. అమ్మ నా.. తో మొదలవుతాయి.
ఇప్పటికి 20 ఏళ్లుగా గెలుస్తూనే ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో మాత్రం చివరి ఎన్నికలని, చెప్పేశారు. నిజానికి ఎలాంటి వారైనా తనముందు దిగదుడుపే అని చెప్పుకొనే కొడాలి.. ఇలా.. దిగి వచ్చారంటే.. స్థానికం గా ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత అయినా ఉండాలి లేదా టీడీపీ ఈ సారి గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనే వాదన నిజమైనా ఉండాలి. అందుకే.. ఈ ఒక్కసారికి గెలిపించాలనే విధంగా బ్రతిమాలుకోవడంపై చర్చ సాగుతోంది.
ఒక్క కొడాలి నాని మాత్రమే కాదు.. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వంటి వారు కూడా.. పెద్ద ఎత్తున రాజకీయ బలం ఉన్నవారే. అయినప్పటికీ.. ఇప్పుడు వ్యూహాత్మకంగా తమ నోటి వెంట ఒక్కచాన్స్.. లాస్ట్ చాన్స్.. అంటూ పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటి వెనుక ఉద్దేశం ఏదైనా కూడా.. బలమైన నాయకులే ఇలా బేలగా మారుతుంటే.. లాస్ట్ చాన్స్ అంటూ జోలె పడుతుంటే.. మిగిలిన నాయకుల పరిస్థితి ఏంటి? వైసీపీ అంత వీక్‌గా ఉందని అర్ధం చేసుకునే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు పరిశీలకులు.