మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ కెరీర్ కొంచెం ఒడుదొడుకులతో సాగుతోంది. అందుకు కేవలం తన సినిమాల సక్సెస్ రేట్ సరిగా లేకపోవడం మాత్రమే కారణం కాదు. ఆ మధ్య అతను రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడటం తన కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపింది. ప్రమాదం తర్వాత రిలీజైన ‘రిపబ్లిక్’ సరిగా ఆడలేదు.
అనారోగ్యం నుంచి కోలుకున్నాక తేజు చేసిన ‘విరూపాక్ష’ ఘనవిజయం సాధించింది కానీ.. అందులో తేజు అంత సౌకర్యవంతంగా కనిపించలేదు. యాక్సిడెంట్ ఎఫెక్ట్ తనపై స్పష్టంగా కనిపించింది. గత ఏడాది పవన్ కళ్యాణ్‌తో కలిసి చేసిన ‘బ్రో’లోనూ తేజు కొంచెం ఇబ్బందిగానే కనిపించాడు. పైగా ఆ సినిమా నిరాశపరిచింది. దీని తర్వాత తేజు చేయాల్సిన ‘గాంజా శంకర్’కు ఏవో ఇబ్బందులు తలెత్తాయంటున్నారు. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.
ఈ లోపు తేజు కొత్త అవతారంలో మీడియా ముందుకు వచ్చాడు. అతను నిర్మాత అవతారం ఎత్తుతుండడం విశేషం. తన తల్లి విజయదుర్గ పేరు మీదుగా అతను ‘విజయదుర్గ ప్రొడక్షన్స్’ అనే సంస్థను మొదలుపెట్టాడు. ఈ సంస్థ పేరు మీద తీసిందే ‘సత్య’ అనే షార్ట్ ఫిలిం. ఇది ఆల్రెడీ కొన్ని చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డులు, రివార్డులు కూడా గెలిచింది. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే గీతా ఆర్ట్స్, అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్,గీతా ఆర్ట్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్.. ఇలా చాలా బేనర్లున్నాయి.
వీటికి తోడు ఇప్పుడు తేజు ఆధ్వర్యంలో విజయదుర్గ ప్రొడక్షన్స్ మొదలైంది. ఈ బేనర్ మీద ఫీచర్ ఫిలిమ్స్ కూడా తీయబోతున్నాడు తేజు. ఇంకో విశేషం ఏంటంటే.. సాయిధరమ్ తేజ్ తన పేరును కూడా తల్లి పేరు కలిసి వచ్చేలా సాయిదుర్గ తేజ్‌గా మార్చుకున్నాడు. అతను గతంలో సాయిధరమ్ తేజ్ నుంచి సాయితేజ్ అనే పేరు మార్చుకుని.. ఈ మధ్య మళ్లీ సాయిధరమ్ తేజ్‌గానే పేర్కొంటున్నాడు. ఇప్పుడు మళ్లీ ‘సాయిదుర్గ తేజ్’గా తన పేరును మార్చుకున్నాడు.