“జనసేనకు సలహాలిచ్చినోళ్లు జగన్ పంచకు చేరిపోయారు“ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యా నించారు. “వాళ్ల నాతో ఆడుకుందామని చూశారు. నాకేదో మంచి చేస్తున్నట్టు ఉన్నారు.కానీ, ఇప్పుడు వారు జగన్ పంచకు వెళ్లిపోయారు. అందుకే నేను వాళ్ల సలహాలు తీసుకోనని చెప్పా. వాళ్లు ఇక్కడ ఉన్నట్టు ఉంటారు. కానీ, మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది“ అని పవన్ పరోక్షంగా ముద్రగడ పద్మనాభంపై విమర్శలు గుప్పించారు.
ఎన్నికలలో తన సత్తా ఏంటో తనకు తెలుసునని పవన్ అన్నారు. ఎన్ని సీట్లు తీసుకోవాలో కూడా తెలు సునని చెప్పారు. “ఎన్ని సీట్లు కావాలో వాళ్లు సలహాలు చెబుతారు. పోనీలే.. అనుకున్నా. కానీ, వాళ్లు ఆ పార్టీలో మనసు పెట్టి.. ఇక్కడ రాజకీయం చేయాలని అనుకున్నారు. కానీ, ఆ మాత్రం నాకు తెలియదా? ఇప్పుడు నిజం బట్టబయలు అయిపోయింది. ఆ పార్టీలోకి వెళ్లిపోయారు“ అని పవన్ వ్యాఖ్యానించారు.
పుష్ప వంటి సినిమాలు కేవలం చూసేందుకు మాత్రమే బాగుంటాయని, చేసేందుకు కాదని.. పవన్ వ్యా ఖ్యానించారు. కానీ, తిరుపతిలో కొందరు మాత్రం ఇదే తరహాలో రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఎర్రచందనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. తిరు మల తిరుపతి దేవస్థానాన్ని కొందరు అడ్డగోలుగా వాడుకుంటున్నారని, సొంత సంస్థగా భావిస్తున్నా రని పవన్ దుయ్యబట్టారు. ఉచిత దర్శనాల పేరుతో శ్రీవారి ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని పరోక్షంగా ఆయన వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.
కాగా.. తాజాగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులు పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయనను పవన్ సాదరంగా ఆహ్వానించి కండువా కప్పారు. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యే సీటును ఆరణికే కేటాయించే అవకాశం ఉంది. అయితే.. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.