సీఎం జగన్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని జగన్ తాకట్టుపెట్టాడని, సచివాలయాన్ని 370 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టడమేమిటని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ భవనాలను కాదు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడంటూ దుయ్యబట్టారు. ఏపీ బ్రాండ్ ను జగన్ సర్వ నాశనం చేశాడని, ఈ అహంకార పాలనపై ఆంధ్రులు గళమెత్తాలని పిలుపునిచ్చారు. లోకసభ మాజీ స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా ఆయనకు చంద్రబాబు నివాళులు అర్పించారు.
ఏపీని 12.50 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసిన జగన్ ఆఖరికి సెక్రటేరియట్ ని కూడా తాకట్టు పెట్టాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఆఖరికి శ్రీలంక కూడా తమ పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టలేదని అన్నారు. ఇది తాకట్టు పెట్టాక శ్రీలంకతో ఏపీని పోల్చడం కూడా సరికాదని, అంతకన్నా దారుణమని ఎద్దేవా చేశారు.
మరోవైపు, చంద్రబాబు సమక్షంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టిడిపిలో చేరారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో జరిగిన బహిరంగ సభలో శ్రీ కృష్ణదేవరాయలకు కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దివంగత నేత, పల్నాటి పులి కోడెల శివప్రసాద్ ను చంద్రబాబు గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ కక్ష సాధింపులతో పల్నాడు ప్రాంతంలో 30 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, అంతకు ముందు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే. వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో టిడిపి బలం మరింత పెరిగిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.