పల్నాడు జిల్లాలోని ఎగువ పల్నాడు ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గం చాలా కీలకమైనది. ఈ నియోజకవర్గంలో గడచిన నాలుగు ఎన్నికల్లో టీడీపీ వరుసగా ఓడిపోతునే ఉంది. ముందు కాంగ్రెస్ తరపున తర్వాత వైసీపీ తరపున పోటీచేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరసుగా గెలుస్తునే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీచేసి ఐదోసారి గెలవాలని రంగం సిద్ధం చేసుకున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీలో జూలకంటి బ్రహ్మారెడ్డిని పోటీలోకి దింపింది. టీడీపీ, జనసేన పోత్తులో పోటీచేయబోయే 99 మంది అభ్యర్ధుల మొదటి జాబితాను నాలుగురోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ జాబితాలో మాచర్ల నుండి బ్రహ్మారెడ్డి పోటీచేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు చంద్రబాబునాయుడు. దాంతో జూలకంటితో పాటు ఆయన మద్దతుదారుల్లో జోరు పెరిగిపోతోంది. నియోజకవర్గంలో పిన్నెల్లిని ధీటుగా ఎదుర్కొనే నేత కోసం చాలా సంవత్సరాలుగా తమ్ముళ్ళు ఎదురుచూస్తున్నారు. ఏ ఎన్నికలోను గట్టి అభ్యర్ధులు దొరకలేదు. అలాంటిది జూలకంటిని చంద్రబాబు వెతికి పట్టుకొచ్చి టికెట్ హామీ ఇచ్చి మరీ ప్రోత్సహించారు. దాంతో చాలా సంవత్సరాలుగా మాచర్లను వదిలేసి గుంటూరులో ఉంటున్న జూలకంటి కూడా మళ్ళీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు.
ఎప్పుడైతే జూలకంటి అడుగుపెట్టారో అప్పటినుండే పార్టీలో జోష్ పెరిగిపోయింది. పిన్నెల్లి వర్గానికి జూలకంటి వర్గానికి చాలాసార్లు గొడవలయ్యాయి. అయినా తగ్గకుండా జూలకంటి వర్గం ఢీ అంటే ఢీ అనేట్లుగా ఎదుర్కొంటోంది. జూలకంటి తప్ప పిన్నెల్లిని ఎదుర్కొనేంత సీనున్న నేత మరొకరు లేరు. కాబట్టి టికెట్ విషయంలో జూలకంటికి పోటీయేలేదు. అందుకనే బ్రహ్మారెడ్డికి మద్దతుగా యావత్ పార్టీ నిలబడింది. ఈయన కూడా టికెట్ కన్ఫర్మ్ కాగానే వరుసగా నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో పర్యటిస్తున్నారు.
పార్టీలోని ముఖ్యమైన నేతల ఇళ్ళకు, తటస్తుల ఇళ్ళకు, వర్తక, వాణిజ్య ప్రముఖల ఇళ్ళకు వెళ్ళి మద్దతు అడుగుతున్నారు. దీనికి అదనంగా జనసేన నేతల మద్దతు ఎలాగూ ఉంది. కాబట్టి మండలాల్లో జూలకంటి ఆధ్వర్యంలో వరుసగా ర్యాలీలు జరుగుతున్నాయి. నియోజకవర్గమంతా మద్దతుదారులతో కలిసి తిరిగేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నారు. జూలకంటి తల్లి,దండ్రులు ఇద్దరు గతంలో ఎంఎల్ఏలుగా పనిచేసిన వారే కావటంతో ప్రత్యేకించి పరిచయటం అవసరంలేదు. ఇంతకాలానికి పిన్నెల్లికి జూలకంటి లాంటి గట్టి ప్రత్యర్ధి ఎదురుపడ్డారని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.