హైదరాబాదులోని గచ్చిబౌలిలో డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాడిసన్ హోటల్ లో బర్త్ డే పార్టీ సందర్భంగా డ్రగ్స్ సేవిస్తున్న కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో బీజేపీ నేత కుమారుడు ఒకరు, బిజినెస్ మ్యాన్ కుమారుడు ఒకరు ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఆ కేసులో ఇద్దరు అమ్మాయిలతో పాటు తొమ్మిది మందిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆ డ్రగ్స్ కేసులో మోడల్ లిపి గణేష్ తో పాటు టాలీవుడ్ నిర్మాత ఒకరి పేరు వినిపిస్తోంది. కానీ, అనూహ్యంగా ఆ కేసులో తాజాగా టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు ఉందని పోలీసులు వెల్లడించడం సంచలనం రేపింది.
ఆ కేసు ఎఫ్ఐఆర్ లో క్రిష్ పేరును కూడా గచ్చిబౌలి పోలీసులు చేర్చడం షాకింగ్ గా మారింది. ఎనిమిదో నిందితుడిగా క్రిష్ పేరు ఉండడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఇక, పార్టీ జరుగుతున్న సమయంలో రాడిసన్ హోటల్ లో క్రిష్ ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఆ పార్టీ జరుగుతున్న రూమ్ లో క్రిష్ అరగంట పాటు కూర్చున్నారని, రాడిసన్ హోటల్ యజమాని వివేకానందతో మాట్లాడారని పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్ లో పేరున్న నిందితులందరిని పిలిచి విచారణ జరుపుతామని వారు వెల్లడించారు.
ఈ వ్యవహారంపై క్రిష్ కూడా స్పందించారు. తాను హోటల్ కి వెళ్ళిన మాట నిజమేనని, ఒక అరగంట పాటు అక్కడ ఉన్నానని క్రిష్ అంగీకరించారు. అయితే, తన స్నేహితులను కలిసేందుకు మాత్రమే అక్కడికి వెళ్లినట్లుగా చెబుతున్నారు. సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు హోటల్ నుండి తాను బయటకు వచ్చేశానని చెప్పారు. డ్రైవర్ లేకపోవడంతోనే అరగంట పాటు వివేకానందతో మాట్లాడానని, అప్పుడే తనకు హోటల్ యజమాని వివేకానందతో పరిచయం ఏర్పడిందని అన్నారు. డ్రైవర్ రాగానే పార్టీ నుంచి వెనక్కి వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు.