“మరో రెండు మాసాలు ఓపిక పట్టండి. మన పార్టీఅధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత.. మార్పును మీరే గమనిస్తారు“ అని టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారాలోకేష్ అన్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో శంఖారావం పేరిట నిర్వహిస్తున్న సభల్లో ఆయన మాట్లాడారు. తాజాగా అనకాపల్లి జిల్లా మాడుగుల శంఖారావం సభలో లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు మాసాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన ఎవరూ పోటీ లేరని అన్నారు.
‘‘మరో రెండు నెలల్లో రాష్ట్రంలో టీడీపీ- జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పటివరకు కొంత వెయిట్ చేయండి.“ అని నారా లోకేష్ అన్నారు. ఇక, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. ఐదేళ్లుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని, జగన్కు మాత్రం ఉద్యోగంకల్పించుకున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే.. విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. పరిశ్రమలు తీసుకురావడం కాదు.. ఉన్నవి కూడా వెళ్లిపోయే పరిస్థితితీసుకువచ్చారని జగన్పై విమర్శలు గుప్పించారు.
“పాలిచ్చే ఆవును వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. తన్నే దున్నపోతు వైసీపీ ప్రభు త్వం.. పాలిచ్చే ఆవు తెలుగుదేశం.“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మాడుగుల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీకి చెందిన మంత్రి బూడి ముత్యాలనాయుడిని గెలిపిస్తే.. ఉత్తరాంధ్రకు ఆయనేం చేశారని ప్రశ్నించారు. ఐదేళ్లలో ఒక్క చోటైనా రోడ్డు వేశారా.. ఒక్క గుంత అయినా పూడ్చారా? అని నిలదీశారు. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి నిల్.. అవినీతి ఫుల్ అని వ్యాఖ్యానించారు.
“టీడీపీ-జనసేనను గెలిపించండి.. అభివృద్ధి ఏంటో చూపిస్తాం. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తా.. పనిచేసేవాళ్లనే ప్రోత్సహిస్తా. ప్రజల్లో ఉంటూ పనిచేసే వారిని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పోస్టులు ఇస్తాం. బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి’’ అని నారా లోకేష్ పిలుపునిచ్చారు. కాగా, 3 రాజధానుల పేరిట మన జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నారని జగన్పై నిప్పులు చెరిగారు.