ఈఫిల్ టవర్.. ప్రపంచ పర్యాటక జాబితాలో చోటు దక్కించుకున్న అద్భుతమైన కట్టడం. దీనిని సందర్శించేందుకు ప్రతి రోజూ విదేశీ పర్యాటకులు క్యూ కడతారు. దీంతో ఏడాది పొడవునా.. ఈ టవర్‌ను సందర్శించేందుకు అనుమతి ఉంది.
అయితే, ఇప్పుడు ఈఫిల్ టవర్ అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చింది. దీనిని మూసివేయడమే దీనికి కారణం. టవర్స్‌లో పనిచేసే ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలని.. టవర్ నిర్వహణను మరింత మెరుగు పరచాలని డిమాండ్ చేస్తూ సోమవారం మెరుపు సమ్మెకు దిగారు.
దీంతో టవర్‌ను మూసివేసే పరిస్థితి వచ్చింది. “సమ్మె కారణంగా, ఈఫిల్ టవర్ మూసివేయబడింది. మేము క్షమాపణ చెపుతున్నాం“ అని టవర్ ముందు బోర్డు వేలాడదీశారు.
సెంట్రల్ ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ ప్రపంచ అద్భుతాల్లో ఒకటి. దీనిని దర్శించుకునేందుకు, విశేషాలు తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు.
ఇక, త్వరలోనే ఇక్కడ వేసవి ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో పర్యాటకుల సందడి మరింత పెరిగింది. అయితే.. సోమవారం ఈఫిల్ టవర్‌ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్న పర్యాటకులు సమ్మెతో నివ్వెరపోయారు.
ఈఫిల్ టవర్ సాధారణంగా సంవత్సరంలో 365 రోజులు తెరిచి ఉంటుంది. ప్రపంచ పర్యాటక కట్టడాల్లో ఇది ప్రముఖంగా ఉంది. దీంతో విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువ.
అయితే.. ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలని చేస్తున్న డిమాండ్, సమ్మెల కారణంగా రెండు నెలల్లో రెండు సార్లు టవర్‌ను మూసివేశారు. డిసెంబరులో ఉద్యోగులు తొలుత తమ డిమాండ్లు వినిపించారు.
ఈఫిల్ టవర్ కు ఆదాయంపెరిగిందని, కానీ, తమ వేతనాలు మాత్రం పెంచడం లేదని వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో తమ వేతనాలు కూడా పెంచాలని సూచిస్తున్నారు. దీనిపై చర్చలు జరిగినా..ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో తొలిసారి క్రిస్మస్ రోజు మొత్తం టవర్‌ను మూసివేశారు.
ఈఫిల్ టవర్ లో పనిచేసే ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న CGT యూనియన్‌కు చెందిన స్టెఫాన్ డైయు మాట్లాడుతూ, ప్యారిస్ మునిసిపాలిటీ యాజమాన్యంలో ఉన్న టవర్‌ను మెరుగుపరచడం, టిక్కెట్ విక్రయాల నుండి వచ్చే ఆదాయానికి అనుగుణంగా జీతం పెరుగుదలను లక్ష్యంగా చేసుకుని సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భవిష్యత్ సందర్శకుల సంఖ్య, నిర్వహణ వంటివి ఉద్యోగుల వేతన పెంపుపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.