టెక్నాలజీ కాలమిది. గోడకు కాదు, గాలికి చెవులుంటాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ… ఆత్మీయుల వద్ద మాట్లాడే మాటలు సైతం ఆచితూచి అన్నట్లుగా మాట్లాడాలి. లేదంటే బుక్కవడం గ్యారంటీ. అలానే బుక్కయ్యాడు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం తాము అనుసరించిన ఫార్ములాను ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పిన అంశాల వీడియో క్లిప్ బయటకు వచ్చింది. వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ క్లిప్ లోని అంశాలు షాకిచ్చేలా మారాయి. దీంతో ఇది పార్టీని బాగా డ్యామేజ్ చేస్తోంది.
ఆయన చెప్పినట్లుగా ఉన్న వ్యాఖ్యల్ని చూస్తే..
‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలోని 55 సర్పంచి స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలుస్తారని చెప్పారు. మిగిలినవన్నీ టీడీపీ సొంతం చేసుకుంటుందని చెప్పారు. దీంతో ఏం చేద్దామని ఆలోచించాం. నిమ్మాడలో మద్దతు ఇచ్చే కింజరావు అప్పన్న సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా టీడీపీ వారు ఇబ్బంది పెట్టారు. ఆ సాకుతో ఊరిపై దాడి చేసి ఆయన్ను నామినేషన్ వేయించా. నన్ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కొట్టారని చెప్పి ఆయన్ను జైల్లో పెట్టించి.. వారి కార్యకర్తలు వీధుల్లోకి రాకుండా చేశాం’’ అంటూ నాడు జరిగిన విషయాల్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. సంతబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థి పుక్కళ్ల శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ‘బయటకు వస్తే మీ అంతు చూస్తాం’ అని హెచ్చరించాం. సంతబొమ్మాళి అభ్యర్థి పుక్కళ్లను హెచ్చరించి.. ఆయనపై రౌడీషీట్ తెరిపించి.. అరెస్టు చేయించినట్లుగా చెప్పుకున్నారు. ‘‘కోటబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థి పూజారి శైలజ భర్త సత్యం ఇంటి తలుపులు వేసి బంధించాం. టెక్కలి.. నందిగాంలలో జడ్పీటీసీ అభ్యర్థులు బయటకు రాకుండా చేశాం.
నాలుగు చొప్పున ఎంపీపీ.. జడ్పీటీసీ స్థానాలు.. 136 పంచాయితీల్లో 119 పంచాయితీలు గెలిచాం. అచ్చెన్నాయుడిని లోపల వేయటం.. ఆ పార్టీ క్యాడర్ను భయపెట్టటం.. ఇలా రౌడీయిజమే చేశాం’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పంచాయితీ నామినేషన్ల సమయంలో నిమ్మాడ గ్రామానికి వెళ్లిన దువ్వాడ శ్రీనివాస్.. కర్రలతో స్వైరవిహారం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాతే ఆయన్ను ఎమ్మెల్సీని చేశారు. గతంలో తాను చేసిన పనుల్ని బయటపెట్టటం.. అవి కాస్తా లీక్ కావటంతో ఈ విషయాల్ని విన్నవారంతా విస్మయానికి గురవుతున్నారు.