రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బండ్ల చెల్లుబాటుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం తాజాగా కీలక తీర్పును ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేత్రత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ఇవ్వటం గమనార్హం.
ఈ రాజ్యాంగ ధర్మాసనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా.. జస్టిస్ బీఆర్ గవాయ్.. జస్టిస్ బేబీ పార్దీవాలా.. జస్టిస్ మనోజ్ మిశ్రాలు ఉన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీం.. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. ఎలక్ట్రోరల్ బాండ్లను తీసుకున్న వారి వివరాల్ని రహస్యంగా ఉంచటం సరికాదని స్పష్టం చేసింది. తమ తీర్పులో కీలక వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఎన్నికల బాండ్లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ‘‘ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1) (ఎ) ప్రకారం ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుంది.
నల్లధనాన్ని అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించటం సమంజసం కాదు. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. బ్లాక్ మనీ నిర్మూలనకుఈ స్కీం ఒక్కటే మార్గం కాదు. రాజకీయ పార్టీలకు విరాళాలు అనేది క్విడ్ ప్రోకోకు దారి తీస్తుంది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచటం కుదరదు. ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుంది’’ అంటూ రాజకీయ పార్టీలకు షాకిచ్చేలా తీర్పు పాఠం ఉంది. ఎలాంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించటాన్నిసమాచారహక్కును ఉల్లంఘించటమేనని సుప్రీం స్పష్టం చేసింది.
వివిధ సంస్థల నుంచి ఎలాంటి పరిమితులు లేకుండా విరాళాలను అనుమతించే కంపెనీ చట్టంలో చేసిన సవరణలు రాజ్యంగ విరుద్ధంగా.. ఏకపక్షంగా ఉన్నట్లుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసే సంస్థల వివరాలు బయటకు వచ్చే వీలుంది. రాజకీయ పార్టీలకు వచ్చే నిధుల్లో పారదర్శకతను తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్రం ఈ పథకాన్ని 2018 జనవరి 2న అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకాన్ని సవాలు చేస్తూ పలువురు రాజకీయ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించటానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన వినతిని సుప్రీం పరిగణలోకి తీసుకుంది.
అక్టోబరు 31 నుంచి మొదలైన వాదనల్ని విన్న రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై మూడు రోజులు విచారణ జరిపింది. నవంబరు 2న తీర్పును రిజర్వు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 2023 సెప్టెంబరు 30 వరకు వచ్చిన బాండ్ల వివరాలు తమకుసీల్డ్ కవర్ లో తెలియజేయాలని పేర్కొంది.