ఏపీ రాజధాని రైతులపై సీఎం జగన్ ఒక్కసారిగా ప్రేమ కురిపించారు. ఇక్కడి పలు గ్రామాల రైతులు.. వీరి లో మహిళా రైతులు కూడా ఉన్నారు. వీరంతా.. కొన్నేళ్లుగా తమకు ఇస్తున్న సామాజిక పింఛన్‌ను రూ.2500 నుంచి రూ.5000లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. అప్పటి నుంచి పట్టించుకోని ప్రభుత్వం.. దీనిపై తాత్సారం చేసింది. ఒకరకంగా పక్కన పెట్టింది. కానీ, ఎన్నికల వేళ.. అమరావతి రైతులను మచ్చిక చేసుకోవాలని అనుకున్నారో.. లేక.. వారిపై నిజంగానే ప్రేమ ఉందో తెలియదు కానీ.. సీఎం జగన్ వారి డిమండ్లకు పచ్చ జెండా ఊపారు.
తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగి పురంలో `వలంటీర్లకు వందనం` కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా రాష్ట్రంలో మెరుగైన పనిచేస్తున్న వలంటీర్లకు సీఎం జగన్ అవార్డులు, రివార్డులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. అమరావతి రైతుల ప్రస్తావన తీసుకువచ్చారు. నిజానికి ఈ ఐదేళ్ల కాలంలో ఏ నాడూ రైతుల గురించి సీఎం జగన్ మాట్లాడింది లేదు. మూడు రాజధానుల కోసం.. ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకున్న సమయంలో రైతులు ఉద్యమించారు.
రాజధానిగా అమరావతినే కంటిన్యూ చేయాలని పట్టుబట్టారు. ఉద్యమాలు చేశారు. పాదయాత్రలు సాగించా రు.పోలీసులు వారిపై అనేక కేసులు పెట్టారు. అయినప్పటికీ. ప్రభుత్వం వారి విషయంలో జాలి చూపకపోగా.. మరింత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది నకిలీ ఉద్యమమని, పెయిడ్ ఆర్టిస్టులని తీవ్రంగా విమర్శించింది. ఇలాంటి పరిస్థితిలో అనూహ్యంగ రాజధాని రైతుల విషయంలో సీఎం జగన్ పింఛన్లు పెంచుతున్నట్టు ప్రకటించడం వెనుక ఎన్నికల ప్రేమే తప్ప.. మరొకటి లేదని.. టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.