ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘శంఖారావం’ యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పాలకొండలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ పై లోకేశ్ విరుచుకుపడ్డారు. మీ బిడ్డను అంటూ ప్రజలను మభ్యపెడుతున్న జగన్..మీ భూములు నాకే ఇవ్వండి అని లాక్కుంటారని లోకేశ్ సెటైర్లు వేశారు. కోట్లు ఖర్చు పెట్టి ‘యాత్ర-2’ సినిమా తీశారని, వైసీపీ నేతలకు టికెట్లు ఇచ్చి ఆ సినిమా చూడాలని అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. వైసీపీకి అంతిమయాత్ర మొదలైందని లోకేశ్ అన్నారు.
జగన్ కు రంగుల పిచ్చి అని, అందుకే టీడీపీ హయాంలో కట్టిన భవనాలకు రంగులేసుకుని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. జగన్ ను ఆయన తల్లి, చెల్లి నమ్మడం లేదని, ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. గతంలో జగన్ కోసం కష్టపడ్డ తల్లిని, చెల్లిని జగన్ మెడపట్టి బయటకు గెంటేశాడని దుయ్యబట్టారు. షర్మిల ఒకవైపు, సునీత మరోవైపు తమకు రక్షణ కల్పించాలని చెప్పే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల మాట్లాడుతుంటే… పేటీఎం కుక్కలు మొరుగుతూ ఆమెపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.
జగన్ పని అయిపోయిందని, అందుకే పక్క రాష్ట్రానికి పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నాడని, పేటీఎం బ్యాచ్ పరిస్థితి ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఇక, కురుపాం వెళ్లే క్రమంలో గతుకుల రోడ్లపై ప్రయాణించిన లోకేశ్…గుంతల రోడ్డుపై ఓ సెల్ఫీ తీసుకున్నారు. జగన్ దివాలాకోరు పాలనకు ప్రత్యక్ష నిదర్శనం ఈ రోడ్డు అని లోకేశ్ విమర్శించారు. కాంట్రాక్టర్ కు బిల్లులు ఇవ్వకపోవడంతో రోడ్డును సగంలో వదిలేసి వెళ్లాడని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు రూ.1.80 లక్షల కోట్లు బకాయి పెట్టడంతో ఈ ప్రభుత్వ పనులు చేయలేక కాంట్రాక్టర్లు చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు.