వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ సెగ తగిలింది. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డీస్సీ ప్రకటనను వ్యతిరేకిస్తూ.. వేలాది మంది నిరుద్యోగులు ఆయన ఇంటిని ముట్టడించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న పెద్దిరెడ్డి ఇంటి ముందు ధర్నాకు సిద్ధమయ్యారు. అయితే.. అప్రమత్తమైన పోలీసులు.. విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. కాగా, వీరి ధర్నాకు కాంగ్రెస్ చీఫ్.. షర్మిల మద్దతు తెలిపారు.
విద్యార్థి సంఘాల నేతల ధర్నాతో మంత్రి పెద్ది ఇంటి మార్గంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ రహదారులను పోలీసులు మూసివేశారు. “దగా డిఎస్సి వద్దు.. మెగా డీఎస్సీ ముద్దు“ బ్యానర్లతో విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. పుంగనూరులోని బాలాజీ కాలనీ నుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముట్టడికి వెళుతుండగా మార్గమధ్యంలో పోలీసులు విద్యార్థ సంఘాల నేతలను అడ్డుకున్నారు. ఈ సమయంలో “షర్మిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. సీఎం డౌన్…డౌన్. పోలీసుల వైఖరి నశించాలి“ అని నేతలు బిగ్గరగా నినదించారు.
ఏంటి వివాదం?
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం 6 వేల 100 పోస్టుల ఉపాధ్యాయ భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే.. 2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ రాష్ట్రంలోని 23 వేల పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు ఆ ఊసు ఎత్తలేదు. పైగా ఇప్పుడు కంటి తుడుపుగా 6100 పోస్టుల భర్తీకి మాత్రమే చర్యలు తీసుకున్నారు. దీనిని అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక, వీరికి కాంగ్రెస్ చీఫ్ షర్మిల నేరుగా మద్దతు ఇచ్చారు. టీడీపీ మాత్రం మద్దతు ప్రకటించకపోయినా.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. తాము ఏటా డీఎస్సీ వేస్తామని నారా లోకేష్ చెప్పారు. ఇక, జనసేన ఈ విషయంపై మౌనంగా ఉంది.