రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో.. చెప్పడం కష్టం. నిన్నటి వరకు అనుకూలం అనుకున్న పరిస్థితులు.. నేడు మారిపోవచ్చు. ఇది.. అప్పటి వరకు విజయం తమదేనని రాసిపెట్టుకున్న నాయకులకు చెమటలు పట్టించనూ వచ్చు. ఇదే అచ్చంగా ఇలాంటి పరిస్థితినే .. గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి ఎదురైందని పరిశీలకులు చెబుతున్నారు. నియోజకవర్గాన్ని మండలాల వారీగా పరిశీలిస్తే.. కేవలం నందివాడలో తప్ప.. గుడివాడ రూరల్, టౌన్, గుడ్లవల్లేరు మండలాల్లో ఆయన ఏటికి ఎదురీదుతోన్న పరిస్థితి.
వాస్తవానికి వరుస విజయాలతో ఉన్న కొడాలి నాని.. వచ్చే ఎన్నికల్లోనూ తనను ఎవరూ ఓడించలేరని చెబుతున్నారు. ఎక్కడ ఏ వేదిక ఎక్కినా.. ఆయన ఇదే చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ విషయం ఆయనకు కూడా అర్ధమైంది. అయినప్పటికీ.. మేకపోతు గాంభీర్య మే ప్రదర్శిస్తోన్న వాతావరణమే నాని చుట్టు పక్కల, గుడివాడ వైసీపీలో కనిపిస్తోంది. గత నాలుగేళ్లుగా.. కొడాలి నాని.. టీడీపీ అధినేత కుటుంబంపై చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలోనూ నానిని ఓడించి తీరాలని.. తగిన విధంగా బుద్ధి చెప్పాలని.. టీడీపీ నిర్ణయించుకుంది.
ఈ క్రమంలోనే ఈ సారి.. వ్యూహాత్మకంగా ఎన్నారై వెనిగండ్ల రాముకు టికెట్ ఇచ్చేసింది. గత ఆరు మాసాల కిందటే ఆయనను రంగంలోకి దింపేసింది. రావి వెంకటేశ్వరరావు వంటి సీనియర్లు టికెట్ ఆశించినా.. పరిస్థితిని వారికి వివరించి.. నచ్చజెప్పి.. వెనిగండ్లకు రూట్ క్లియర్ చేసింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, ఆర్థికంగా బలంగా ఉండడంతోపాటు.. పార్టీ నేతల సమస్యలను కూడా వెనిగండ్ల పరిష్కరిస్తున్నారు. దీంతో గత నాలుగు ఎన్నికలకంటే కూడా.. ఇప్పుడు టీడీపీ ఇక్కడ పుంజుకుంది.
దీనికి వెనిగండ్ల సతీమణి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఆమె కొన్నాళ్లుగా ఆ వర్గంలో సేవలు ముమ్మరం చేయడంతో ఎస్సీ ఓటు బ్యాంకు కూడా.. టీడీపీకి అనుకూలంగా మారిపోయింది. గుడివాడ నియోజకవర్గంలోని ఎస్సీల్లో ఈ విధమైన మార్పు ఇన్నేళ్లకు కనిపిస్తోంది. ఫస్ట్ టైం ఎస్సీ ఓటర్లు కూడా నానికి యాంటీగా కనిపిస్తున్నారు. నానికి దిమ్మతిరిగే ఈక్వేషన్‌తో ఇలా చెక్ పెట్టిన ఘనత చంద్రబాబు, వెనిగండ్ల రాముకే దక్కుతుంది. ఈ క్రమంలోనే తన సీటు త్యాగం చేసి నానిని ఓడించడానికి కష్టపడుతున్న రావి వెంకటేశ్వరరావు విషయంలోనూ పార్టీ పరంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ఇక, మండలాల వారీగా చూస్తే.. గుడ్ల వల్లేరు ఎప్పటి నుంచో టీడీపీకి కంచుకోటగా ఉంది. ఇప్పుడు మరింత పుంజుకుంది. గుడివాడ టౌన్‌లోనూ టీడీపీ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పటి వరకు లేని విధంగా నానికి చెమటలు పడుతున్నాయని అంటున్నారు. పైకి ఆయన గెలుస్తానని చెబుతున్నా.. వెనిగండ్ల దూకుడు ముందు.. తన ఎత్తులు పారేలా లేవని లోలోన మదన పడుతున్నట్టు గుడివాడ పొలిటికల్ ఈక్వేషన్లు చెపుతున్నాయి.