తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎత్తులపై ఎత్తు లు వేస్తున్నారు. ఇక్కడ గెలుపు ఏకపక్షం అవుతుందని ముందుగానే ఊహించిన జగన్.. తన ప్రమేయం ఉండదని అనుకున్నారు.
స్థానిక ఎన్నికల్లో మాదిరిగా.. తాడేపల్లి నుంచే తతంగం మొత్తం నడిపించవచ్చని అంచనావేసుకున్నారు. అయితే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈ ఉప పోరును సీరియస్గా తీసుకుని ప్రచారం చేస్తోంది. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ టీడీపీ ప్రచార హోరును పెంచేసింది.
ఇక, మరోవైపు బీజేపీ-జనసేన కూటమి కూడా భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది. వాస్తవానికి జగన్ ఈ పరిణా మాన్ని ఊహించలేదు. స్థానిక ఎన్నికల్లో దెబ్బతిన్నారు కాబట్టి తిరుపతిలోనూ అదే పరిస్థితి కొనసాగుతుంద ని తక్కువ అంచనా వేసుకున్నారు.
కానీ, అనూహ్యంగా టీడీపీ వ్యూహాలు వేసుకుని.. ముందుకు సాగుతోంది. దీంతో వైసీపీ గెలిచినా.. జగన్ ఆశించిన మెజారిటీ రాదనే లెక్కలు తేలిపోయాయి. దీంతో తనే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 14న స్వయంగా తనే ప్రచారం చేయాలని నిర్ణయించు కున్నట్టు తాడేపల్లి వర్గాలు క్లూలిచ్చాయి.
మరోవైపు.. తిరుపతి ప్రజలకు జగన్ లేఖలు సంధించారు. తాను ఈ రెండేళ్లలో చేసిన సంక్షేమం, ప్రజలకు ఇచ్చిన వరాలు వంటి వాటిని గుదిగుచ్చి లేఖలు తయారు చేయించి ఇంటింటికీ పంచాలని నిర్ణయించు కున్నారు. అయితే.. ఈ ఎత్తు విషయం తెలిసిన వెంటనే టీడీపీ కూడా అలెర్ట్ అయిపోయింది.
ఇప్పుడు అదే ఊపుతో టీడీపీ కూడా .. జగన్ను మించి లేఖలు, సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని భావిస్తున్నట్టు సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు చెప్పేశారు.
టీడీపీ హయాంలో తిరుపతిలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. చంద్రబాబు స్వయంగా తిరుపతి ప్రజలకు లేఖలు రాయాలని నిర్ణయించుకున్నారు. అదేసమయంలో ఈ రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులను కూడా లేఖల్లో వివరించడంతోపాటు.. దాడుల తాలూకు వీడియోలు, ఫొటోలను కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం సీబీఎన్(చంద్రబాబు నాయుడు) ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. రాబోయే ఐదు రోజుల్లో ఈ ప్రచారాన్ని మరింత తీవ్రం చేయడంతోపాటు.. చంద్రబాబు స్వదస్తూరితో లేఖలు రాయాలని నిర్ణయించుకున్నట్టు యనమల పేర్కొన్నారు. మరి ఈ దెబ్బకు వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.