ఇప్పుడు సడెన్‌గా ‘ రాజధాని ఫైల్స్’ సినిమా లైన్లోకి వచ్చింది. వర్మ సినిమాల్లో మొదటిది ‘వ్యూహం’ ఎన్నికలకు ముందు రిలీజయ్యే సంకేతాలు కనిపించడం లేదు. అది కోర్టు కేసుల్లో చిక్కుకుంది. ఇక శపథం గురించి ఆలోచనే లేదు. ‘యాత్ర-2’ ట్రైలర్ ఓకే అనిపించింది కానీ.. మరీ ఏకపక్షంగా ఉందన్న వ్యాఖ్యానాలు వినిపించాయి. లేటుగా రేసులోకి వచ్చిన ‘రాజధాని ఫైల్స్’కు వస్తున్న స్పందన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీని ట్రైలర్ కేవలం ఏడు గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం, లైక్స్ కూడా అనూహ్యంగా ఉండటం గమనార్హం.
అమరావతి రైతుల వ్యధ గురించి పరిమిత బడ్జెట్లో పెద్దగా పేరులేని ఆర్టిస్టులను పెట్టి తీసినా.. ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ‘యాత్ర-2’లో పేరున్న ఆర్టిస్టులు ఉండి, పెద్ద బడ్జెట్లో తీసినా.. ‘యాత్ర’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీకి కొనసాగింపుగా వచ్చినా.. దీనికి మూడు రోజుల్లో వచ్చిన వ్యూస్, లైక్స్‌ను ఆరు గంటల్లోనే ‘రాజధాని ఫైల్స్’ దాటేయడం సంచలనం అనే చెప్పాలి. ఇక నెల కిందట వచ్చిన ‘వ్యూహం’ చిత్రానికి వచ్చిన వ్యూస్ ‘రాజధాని ఫైల్స్’ కొన్ని గంటల్లో సాధించిన వ్యూస్‌లో పదో వంతు మాత్రమే ఉండటం గమనార్హం. ఇది ఏపీ జనాల మూడ్‌కు నిదర్శనమా అన్న చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ సినిమాల కాక కూడా బాగానే ఉండేలా కనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు ‘యన్.టి.ఆర్’, ‘యాత్ర’, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లాంటి సినిమాలు రిలీజయ్యాయి. అప్పటి జనాల మూడ్‌ను ఈ సినిమాల ఫలితాలు సరిగ్గానే ప్రతిబింబించాయి. ‘యాత్ర’కు మంచి ఫలితం దక్కితే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.
‘యన్.టి.ఆర్’ మంచి సినిమానే అయినా కూడా తీవ్ర నిరాశ తప్పలేదు. తర్వాతి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తే.. టీడీపీ మట్టికరిచింది. కట్ చేస్తే ఇప్పుడు రాబోతున్న పొలిటికల్ సినిమాలు ఎలాంటి ఫలితాలు అందుకుంటాయో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గత పర్యాయం వైసీపీ అనుకూలంగా ‘యాత్ర’ సినిమా తీసిన మహి.వి.రాఘవ్ ‘యాత్ర-2’తో వస్తుంటే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను రూపొందించిన రామ్ గోపాల్ వర్మ వ్యూహం, శపథం చిత్రాలను రెడీ చేశాడు. టీడీపీకి మద్దతుగా మొన్నటిదాకా సినిమాలేవీ లేవు.