ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించడానికి నిరసనగా టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు పలు బిల్లులను ప్రవేశ పెట్టడంతో పోడియంలోకి టీడీపీ సభ్యులు దూసుకుపోయి బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. దీంతో, సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒక రోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు.
సస్పెన్షన్ తీర్మానాన్ని తమ్మినేని చదువుతున్న సమయంలో స్పీకర్ పోడియంలో టీడీపీ సభ్యులు ఈలలు వేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ ఆదేశించినా వారు అక్కడి నుంచి వెళ్లకపోవడంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.
అంతకుముందు, ఏపీ సర్పంచుల సంఘం, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పోలీసులను తప్పించుకుని అసెంబ్లీ పరిసరాలకు సర్పంచులు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దారిమళ్లించిన ఆర్థిక సంఘం నిధులను సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. దీంతో, సర్పంచులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. ఈ ఘటనలో పలువురు సర్పంచులు గాయపడ్డారు. దీంతో, పోలీసుల తీర్పు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.