నటసింహం, తెలుగుదేశం పార్టీ అగ్రనేత, ఎమ్మెల్యే బాలకృష్ణ.. వైసీపీ ప్రభుత్వంపై తాజాగా సటైర్లతో విరుచుకుపడ్డారు. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ నాయకులతో కలిసి ఆయన హాజరయ్యారు. అందరిలాగానే..తాను కూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని.. పాదయా త్రగా అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను కూడాఅడ్డుకున్నారు. అయితే.. తానేంటో తెలిసే.. అడ్డుకుంటున్నారా? అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అనంతరం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల ముందు కొద్దిసేపు నిరసన తెలిపిన బాలయ్య అనంతరం వాటిని తోసుకుంటూ ముందుకు సాగారు. సభలో కొన్ని నిముషాలు ఉన్న అనంతరం బయటకు వచ్చా రు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బాలయ్య వైసీపీ సర్కారుపై సటైర్లు వేశారు. “ బైబై జగన్. ఇక, వైసీపీ పని ఖతం.. దుకాణం బంద్. తట్టా బుట్టా సర్దేయాల్సిందే“ అని తనదైన శైలిలో డైలాగులు పేల్చారు.
వైసీపీ పని అయిపోయిందని బాలయ్య అన్నారు. ఆ పార్టీ గురించి, ఆ నేత(జగన్) గురించి మాట్లాడేందు కు ఏమీ లేదని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నాదన్నారు. అందుకే పోలీసుల సాయంతో తమను అడ్డుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకునే కొత్త సంప్రదాయానికి వైసీపీ శ్రీకారం చుట్టిందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. సీఎం జగన్ కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలని అన్నారు.