సరికొత్త సంచలనంగా మారారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తాజాగా టీడీపీ ఆఫీసుకు వెళ్లిన ఆయన.. ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పాలి. ఖమ్మంలోని టీడీపీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా పొంగులేటి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదన్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించటమేకాదు.. ఆ నిర్ణయం వల్ల తమ గెలుపు ఖాయమైందని వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేకున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో దూరంగా ఉందన్నారు. టీడీపీ కార్యకర్తలు సైతం ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన వైనాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడైనా కాంగ్రెస్ నేతలు ఆదమరిచి వ్యవహరించారేమో కానీ టీడీపీ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచేంతవరకు నిద్ర పోలేదు. తెలుగు తమ్ముళ్ల కారణంగా గెలిచాం’’ అంటూ వ్యాఖ్యానించారు.
టీడీపీ ఆఫీసుకు వెళ్లిన మంత్రి పొంగులేటి.. కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. టీడీపీ.. కాంగ్రెస్ వేర్వేరు కాదని భవిష్యత్తులో కలిసి ఉందామని వ్యాఖ్యానించటం గమనార్హం. ఓవైపు ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. టీడీపీకి వ్యతిరేకంగా ఏపీ కాంగ్రెస్ రథసారధిగా ఉన్న షర్మిల మండిపడుతుంటే.. తెలంగాణలో మంత్రి పొంగులేని నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావటం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై పలు వ్యాఖ్యలు.. వ్యాఖ్యానాలు వినిపిస్తుండటం గమనార్హం.