రాబోయే ఎన్నికల్లో వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ పోటీచేయటం దాదాపు ఖాయమైపోయినట్లే. కాకపోతే కడప పార్లమెంటు అభ్యర్ధిగానా లేకపోతే పులివెందుల ఎంఎల్ఏగానా అన్నదే నిర్ధారణ కాలేదట. పోటీ చేయించాలనే విషయం వైఎస్ షర్మిల, వైఎస్ సునీత భేటీలో నిర్ణయమైనట్లు సమాచారం. షర్మిల, సునీత ఇద్దరు ఇడుపులపాయలో దాదాపు రెండుగంటలు భేటీ అయ్యారు. ఇద్దరికీ కామన్ శతృవు జగన్మోహన్ రెడ్డే అన్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ తో వివేకా హత్య నేపధ్యంలో సునీత, ఇంటి వ్యవహారాల నేపధ్యంలో షర్మిల శతృవులుగా మారారు.
ఒకపుడు సునీత ఇపుడు షర్మిల పదేపదే జగన్ను టార్గెట్ చేస్తున్నారు. అందుకనే జగన్ అంటే వీళ్ళల్లో పేరుకుపోయిన కసిని రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధులను పోటీలోకి దించటం ద్వారా తీర్చుకోవాలని డిసైడ్ అయినట్లున్నారు. నిజానికి కాంగ్రెస్ అభ్యర్ధులుగా కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీలకు ఎవరు పోటీచేసినా గెలిచేది లేదని అందరికీ తెలిసిందే. అందుకనే వైసీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున పోటీచేయబోయే అభ్యర్ధులకు టీడీపీ, జనసేన మద్దతును కూడగట్టాలని షర్మిల, సునీత ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అంటే అన్నీ పరిస్ధితులు అనుకూలమైతే వైసీపీ ఎంపీ, అసెంబ్లీ అభ్యర్ధులకు పోటీగా టీడీపీ, జనసేన మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్ధులు పోటీచేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే పోటీచేయబోయే అభ్యర్ధులను బట్టి టీడీపీ, జనసేన మద్దతిచ్చే విషయం ఆధారపడుంది. ఎవరినో పోటీలోకి దింపుతామంటే పై రెండుపార్టీలు మద్దతుగా నిలిచే అవకాశాలు తక్కువనే చెప్పాలి. అందుకనే సునీత, షర్మిల కుటుంబాల నుండే పోటీచేయించాలి.
సరిగ్గా ఇక్కడే సానుభూతి కోసం వివేకా భార్య సౌభాగ్యమ్మను పోటీలోకి దింపాలని అక్క, చెల్లెళ్ళిద్దరు డిసైడ్ అయ్యారట. అయితే ఎంపీగానా లేకపోతే ఎంఎల్ఏలగానా అన్నది మాత్రం డిసైడ్ కాలేదట. కడప పార్లమెంటు నుండి వైసీపీ తరపున అవినాష్ రెడ్డే పోటీచేస్తారని వీళ్ళు డిసైడ్ అయ్యారు. అందుకనే సౌభాగ్యమ్మను ఎంపీగా పోటీచేస్తేనే ఉపయోగం ఉంటుందని ఆలోచించారట. అనేక కోణాల్లో, పై రెండుపార్టీల అధినేతలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని షర్మిల, సునీతలు అనుకున్నట్లు టాక్. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.