ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మరో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అదే.. `పల్లె పిలుస్తోంది.. రా, కదలి రా!` కార్యక్రమం . ఇప్పటి వరకు చంద్రబాబు రా.. కదలిరా! పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల పరిదిలో ఉదయం, సాయంత్రం పర్యటిస్తూ.. భారీ ఎత్తున బహిరంగ సభలు పెడుతున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధంచి పార్టీనిబలోపేతం చేయడం, శ్రేణుల్లో ఉత్సాహం నింపడం వంటి లక్ష్యాలతో చంద్రబాబు దూసుకుపోతున్నారు.
ఈ క్రమంలో తాజాగా `పల్లె పిలుస్తోంది రా కదలి రా` పేరుతో టీడీపీ కార్యక్రమానికి చంద్రబాబు పిలుపునిచ్చారు. సంక్రాంతిని పురస్కరించుకుని గ్రామీణ వాతావరణంలో నిర్వహించే భోగి మంటల్లో ఏపీ సమస్యలపై ఫొటోలు తగలబెట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం, సోమవారం రోజుల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని టీడీపీ అధినేత పిలుపునిచ్చారు. భోగి మంటల కార్యక్రమంలోపార్టీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. అమరావతిలో నిర్వహించే కార్యక్రమంలోనూ చంద్రబాబు పాల్గొననున్నారు.
వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలపనున్నారు. కాగా, ఈ కార్యక్రమాల్లో మిత్రపక్షం జనసేన కూడా పాల్గొననుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు తో కలిసి పవన్ కళ్యాణ్ అమరావతిలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక, నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో జనసేన కేడర్ పాల్గొననుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా.. వైసీపీపై యుద్ధం ప్రకటించడంతోపాటు.. వచ్చే ఎన్నికల్లో పార్టీ కేడర్‌ను బలోపేతం చేయాలని క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు.