అంబటి రాయుడు.. మాజీ భారత క్రికెటర్. తాజాగా రాజకీయంగా దుమారం రేపుతున్న వ్యక్తి కూడా. వైసీపీలో ఇలా చేరి అలా బయటకు వచ్చేసి ఆసక్తి రేపిన ఆయన అనూహ్యంగా జనసేనకు టచ్‌లోకి వెళ్లారు. ఏకంగా ఆ పార్టీ చీఫ్.. పవన్ కళ్యాణ్‌తోనూ భేటీ అయ్యారు. అయితే..ఇక్కడ కూడా ఆయన ఆశలకు అవకాశాలు లభించినట్టు కనిపించడం లేదు. దీంతో ఆయన ఎలాంటి సంతోషం లేకుండానే వచ్చిన కారులో వచ్చినట్టే ఓ గంటకు తిరుగు ముఖం పట్టారు. దీంతో అంబటి ఆశలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు.. మరో రెండు మాసాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల ని భావిస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో అంబటి రాయుడు ఆశిస్తున్న సీట్లకు.. ప్రధాన పార్టీల్లో ఉన్న అవకాశాలకు మధ్య పొంతన ఎక్కడా కుదరడం లేదు. ఇదే రాయుడకు చిక్కులు తెస్తోంది.
వైసీపీలో ఏం జరిగింది?
వైసీపీలో కొన్నాళ్ల కిందట చేరిన రాయుడు.. గుంటూరు ఎంపీ సీటును కోరుకున్నారు. లేకపోతే.. విజయవాడ పార్లమెంటు స్థానం ఇవ్వాలని అదీ కుదరకపోతే.. సత్తెనపల్లి, లేదా పొన్నూరు స్థానాలను ఆశించారు. కానీ, ఇవేవీ వైసీపీలో ఖాళీగా లేదు. పైగా బలమైన నాయకులు ఉన్నారు. దీంతో ఆయనను మచిలీపట్నం వెళ్లాలని.. లేదా నరసరావుపేట తీసుకోవాలని పార్టీ సూచించింది. దీంతో ఈ ఫార్ములా వర్కవుట్ కాక రాయుడు బయటకు వచ్చారు.
జనసేనలో ఇవీ ఆశలు..
తాజాగా జనసేన అధినేత పవన్‌తో జరిగిన చర్చల్లో రాయుడు.. రాయుడు రెండు అసెంబ్లీ స్థానాల నుంచి ఒక్కటైనా కేటాయించాలని కోరారు. ఒకటి పొన్నూరు, రెండు అవనిగడ్డ. అయితే..ఈ రెండు టీడీపీకి కీలకమైన స్థానాలు ఒకటి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌కు కేటాయించిన సీటు, రెండో మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్‌కు కేటాయించిన సీటు దీంతో ఇవి తక్క ఏదైనా.. అని ఆఫర్ ఇచ్చారు. దీంతో ఆయన ఆలోచించుకుని చెబుతానని వెళ్లిపోయారు. మొత్తానికి అంబటి ఆశలు.. బాగానే ఉన్నా.. అవకాశాలు మాత్రం కష్టంగానే ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.