ఏపీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా ఎంతన్న విషయాన్ని తెలియజేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. తిరుపతి జిల్లాలో సిట్టింగుల్లోని ముగ్గురు దళిత ఎమ్మెల్యేల్ని మారుస్తున్నట్లుగా ప్రచారం జరగటం తెలిసిందే. ఇలాంటి వేళ చోటు చేసుకున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి పెద్దిరెడ్డి ని కలిసిన దళిత ఎమ్మెల్యే ఒకరు..ఆయన కాళ్లకు మొక్కిన వైనం చర్చగా మారింది.
దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ గా మారింది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డిని తిరుపతిలోని ఆయన నివాసంలో కలిశారు. నియోజకవర్గ అభిరుద్ధి పనుల కోసం మంత్రిని కలిసినట్లుగా చెప్పినప్పటికీ.. తనకు టికెట్ కేటాయించే అవకాశం లేదన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. తనకు టికెట్ ఇవ్వాలని కోరేందుకే మంత్రి పెద్దిరెడ్డిని కలిసినట్లుగా చెబుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మంత్రి పెద్దిరెడ్డిని కలిసే సమయంలో.. ఆయన కాళ్లకు మొక్కిన ఎమ్మెల్యే ఫోటో బయటకు రావటంతో కలకలం రేగింది. టికెట్ కోసం కాళ్లు పట్టించుకుంటారా? అన్నది చర్చగా మారింది. టికెట్ విషయంలో తనకు అన్యాయం చేయొద్దని మంత్రిని కోరినట్లుగా తెలుస్తోంది. కట్ చేస్తే.. దళిత ఎమ్మెల్యేల్ని మార్చాలన్నట్లుగా పార్టీలో నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సైతం ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దళితులుగా పుట్టటం తాము చేసిన నేరమా? పాపమా? మా కర్మా? అంటూ చేసిన వ్యాఖ్యల కలకలం ఒక కొలిక్కి రాకముందే.. మరో దళిత ఎమ్మెల్యే మంత్రి కాళ్లకు మొక్కాల్సి రావటం దేనికి నిదర్శనం? అని ప్రశ్నిస్తున్నారు.