అధికారంలో ఉన్నప్పుడు.. అత్యున్నత స్థానంలో పని చేసే అవకాశం వచ్చినప్పుడు.. ప్రభుత్వానికి కీలకంగా వ్యవహరించే వేళలో.. అప్రమత్తంగా ఉండాలి. పార్టీ కఠిన నిర్ణయాన్ని తీసుకొని ఉండొచ్చు. కానీ.. పద్దతి ప్రకారం నడుచుకోవాలన్న ఆలోచన లేకుండా వ్యవహరించే వ్యవహారశైలిని చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి తీరు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
టికెట్ మార్పుపై మాట్లాడేందుకు వచ్చిన ఆయన్ను కనీసం మాట్లాడకుండా.. ఆద్యంతం చిన్న బుచ్చుతూ వ్యవహరించిన తీరును తప్పు పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే తిప్పే స్వామి ఏపీ సచివాలయానికి తన అనుచరులతో వచ్చారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జలతో మాట్లాడేందుకు ప్రయత్నించిన సాధ్యం కాకపోవటంతో ఆయన కోసం సచివాయలం ప్రధాన ద్వారం వద్ద ఉన్నారు. సజ్జల బయటకు వెళుతున్న వేళలో సజ్జలను తిప్పే స్వామి అనుచరులు అడ్డుకున్నారు. తమ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వాలని.. అప్పుడే పార్టీ గెలుస్తుందని కోరారు.
సర్వేల పేరుతో ఎవరినో తెచ్చి పెట్టొద్దని కోరారు. తిప్పే స్వామికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యకర్తల హడావుడితో తిప్పే స్వామి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి వేళ.. అధికార పార్టీ ఎమ్మెల్యేను సజ్జల వద్దకు ఒక పోలీసు అధికారి తీసుుకొచ్చి.. సార్ ఎమ్మెల్యేగారు.. అని చెప్పగా.. కారులో నుంచి చూసిన సజ్జల.. ‘‘నువ్వా.. సరే.. సరే.. నేను మళ్లీ ఫోన్ లో మాట్లాడతాలే’ అంటూ వెళ్లిపోయారు.
మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ సుద్దులు మాట్లాడే సజ్జల.. పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు.. ఆయనతో కనీసం నాలుగు ముక్కలు కూడా మాట్లాడకుండా ఉన్న వైనాన్ని తప్పుపడుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేను గుర్తు పట్టలేని స్థితిలో సజ్జల ఉన్నట్లుగా మండిపడుతున్నారు. ఏమైనా.. ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నో అని చెప్పిన వేళ.. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయాన్ని సర్ది చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు. అందుకు భిన్నంగా వారిని దూరంగా పెట్టటం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.