కీలక వ్యాఖ్యలు చేశారు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్. జేఎన్టీయూ హైదరాబాద్ సాత్నకోత్సవానికి హాజరైన ఆయన.. అందుబాటులోకి వచ్చే తదుపరి సాంకేతికత పుణ్యమా అని మనిషి ఆయుష్షు ఎంతలా పెరుగుతుందో చెప్పి విస్మయానికిగురి చేవారు. విద్య.. వైద్య.. ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు ఫ్యూచర్ లో వినూత్న ఆవిష్కరణలతో మనిషి జీవించే కాలం పెరుగుతుందని ఆయన స్పష్టం చేవారు.
పాడైన అవయువాలు.. చనిపోయే దశలో ఉన్న జీవకణాల్ని మార్చటం ద్వారా మనం 200-300 ఏళ్లు జీవించే వీలుందని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మనిషి జీవితకాలం 35 ఏల్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు 70 ఏళ్లకు పెరిగిందన్నారు. దేశంలో భారీ వ్యయంతో నిర్మించే సినిమాలతో పోలిస్తే అంతరిక్ష రహస్యాలను తెలుసుకోవటానికి ఇస్రో చేస్తున్న పరిశోధనలు తక్కువ ఖర్చుతో పూర్తి అవుతున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ ఏడాది పీఎస్ఎల్ వీ.. జీఎస్ఎల్ వీ గ్రహాల కక్షల్లోకి పంపుతున్నామని.. వీటితో తుపాన్లు.. భారీ వర్షాలు ఎప్పుడు ఎక్కడ వస్తాయన్న విషయాన్ని కచ్చితత్త్వంతో తెలుసుకునే వీలుందన్నారు. అంతరిక్షంలోకి మనుషుల్ని పంపే మిషన్ గగన్ యాన్ ను ఈ ఏడాదిలో పూర్తి చేస్తామన్న ఆయన.. ‘సూర్యగ్రహంపై చేస్తున్న ప్రయోగం శనివారం సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది’’ అంటూ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
వర్సిటీ విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించే వేళలో.. సోమనాథ్ విద్యార్థిగా ఉన్నప్పుడు తనకు ఎదురైన అనుభవాల్ని.. వ్యక్తిగత అంశాల్ని వెల్లడించటం ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశారు. ‘‘ఏదైనా సబ్జెక్టులో ఫెయిల్ అయితే పిల్లలపై తల్లిదండ్రులు.. స్నేహితుల ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటున్నాయి. ప్రస్తుతం నేనీ స్థితిలో ఉన్నందున అన్నీ విజయాలే సాధించానని మీరు అనుకుంటారు. కానీ.. నేనూ ఒకట్రెండు పరీక్షల్లో ఫెయిల్ అయ్యా. చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయ వంతమైందంటూ విశ్వ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.
కానీ.. అంతకుముందు రెండుసార్లు ఫెయిల్ అయిన విషయాన్ని అందరూ మర్చిపోయారు. అపజయాల్ని విద్యార్థులు సోపానంగా మార్చుకోవాలి. నేను కూడా రాకెట్లు.. ఉపగ్రహాలు తయారు చేసేటప్పుడు తప్పులు చేశా. వాటిని నిజాయితీగా అంగీకరించి విజయం సాధించేందుకు ఏం చేయాలో ఆలోచించా’’ అంటూ తన అనుభవ పాఠాల్ని వెల్లడించారు.