టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. బీసీలకు గుర్తింపు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ప్రాధాన్యత లేకుండా చేసిన కార్పొరేషన్ పదవులు ఇచ్చి బీసీలను మోసం చేసింది.. జగన్ అని వ్యాఖ్యానించారు. తాజాగా దెందులూరు నియోజకవర్గం అంకన్నగూడెంలో నిర్వహించిన `జయహో బి.సి` కార్యక్రమంలో ప్రభాకర్ పాల్గొని ఆవేశంగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై చింతమనేని నిప్పులు చెరిగారు. “జనంలో చచ్చేది నేను – జైల్లో చచ్చేది నువ్వు జగన్“ అని నిప్పులు చెరిగారు. బిసి సాధికారతే ద్యేయంగా రాష్ట్రంలో నిర్మాణం జరిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టాకే రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఉన్న బిసి వర్గాల వారిని వెతికి మరీ ప్రోత్సహించామన్నారు.
కార్యకర్త నుంచి మంత్రుల వరకు బిసి వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తాను ఎమ్మెల్యే గా ఉండగా ఉపాధి హామీ పథకం అమలులో దెందులూరు నియోజక వర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచానన్నారు. పరిపాలన చేతకాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేశారని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో ఏరులై పారుతున్న కల్తీ మద్యం సారా తాగి బలవుతున్న కుటుంబాల ఉసురు ఈ జగన్మోహన్ రెడ్డికి తగులుతుందని అన్నారు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందే పరిస్థితి లేదన్నారు. ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించటలేద న్నారు. పేదవాడి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. “రేపటి రోజున ప్రజల్లో చచ్చేది నేను – జైల్లో చచ్చేది జగన్మోహన్ రెడ్డి“ అని వ్యాఖ్యానించారు. సైకో పాలన పోవాలి – సైకిల్ రావాలి – బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారంటీతో అసలైన ప్రజా సంక్షేమ పాలన అమలు చేస్తామని ప్రభాకర్ అన్నారు. మరో 3నెలల్లో జగన్ ప్రభుత్వం భారీ ఓటమితో గద్దె దిగటం ఖాయమని చింతమనేని వ్యాఖ్యానించారు.