ఏపీ సీఎం జగన్ సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ మిస్టరీ పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. జగన్ పై వివేకా కూతురు సునీతా రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు జాతీయ మీడియాలనూ చర్చనీయాంశం కావడంతో జగన్ ఇరకాటంలో పడ్డారు. తన తండ్రిని చంపి రెండేళ్లవుతున్నా నిందితులెవరో తెలీదని, జగన్ సహకారం ఉంటే ఢిల్లీ ఎందుకు వస్తానని సునీత సంధించిన ప్రశ్నలు వైసీపీ నేతలకు బాణాల్లా గుచ్చుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ సహా విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వివేకా హత్య కేసు చార్జిషీట్ లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డిల పేర్లున్నాయని, అయినా జగన్ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. వివేకా హత్య వెనుక రహస్యం జగన్ కు తెలుసని, అందుకే ఆ కేసు విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని దుయ్యబడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ కీలక నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య వెనుక పులివెందుల రాజన్నకోట రహస్యాన్ని జగన్ బయటపెట్టాలని వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను తాము చంపలేదని తిరుమల వెంకన్న మీద ప్రమాణం చేయాలంటూ జగన్ కు లోకేశ్ విసిరిన సవాల్ పై బుద్ధా వెంకన్న స్పందించారు.
ఏప్రిల్ 14న తిరుపతి వేంకటేశ్వరస్వామిపై ప్రమాణానికి వస్తున్నారా? లేదా? అని జగన్ ను ప్రశ్నించారు. లోకేశ్ సవాల్ కు స్పందించలేదంటే… బాబాయ్ ది గుండెపోటు కాదన్నమాటేనని చురకలంటించారు. వెంకన్న స్వామిపై ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని లోకేశ్ ప్రకటించారని, మరి జగన్ కూడా సిద్ధమో కాదో చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, పరిషత్ ఎన్నికల షెడ్యూల్ కు వ్యతిరేకంగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య న్యాయపోరాటం చేస్తున్న నేపథ్యంలో ఆయనకు వైసీపీ నేతల నుంచి బెదిరింపులు రావడంపై బుద్ధా వెంకన్న మండిపడ్డారు. దళిత నాయకుడైన వర్ల రామయ్యకు వైసీపీ రౌడీలు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఆ కాల్స్ చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని, రామయ్యకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.