ఏపీలో ఎన్నికలకు ముందు తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు ఉద్యమాలకు దిగారు. ఇప్పటికే అంగన్వాడీలు గత వారం రోజులుగా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. ఇక, ఆశావర్కర్లు మంగళవారం నుంచి ఉద్యమాలకు సిద్ధమయ్యారు. మరోవైపు వలంటీర్లు కూడా.. ఈ నెల 29 నుంచి నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా ఉద్యమాలకు తాము మద్దతు తెలుపుతున్నట్టు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. వివిధ వర్గాలు చేపట్టిన ఉద్యమాలకు తమ మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిందని విమర్శించారు. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశారని విమర్శించారు.
రాష్ట్రంలో ఉద్యమించిన అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లకు తమ మద్దతు ఉంటుంద న్నారు. త్వరలో వాలంటీర్లు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేసే నిరసనలకు కూడా మద్దతు ఇస్తామని.. వారితో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని వ్యాఖ్యానించారు. మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టీడీపీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తోందన్నారు.
అంగన్వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మద్దతు తెలిపాయో.. అలానే సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు కూడా మద్దతు తెలపాలని పిలుపు ఇస్తున్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆయా జిల్లాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ నిరసనల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.