అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం రాప్తాడు లో ఈ దఫా టీడీపీ గెలుపు పక్కా.. అనే టాక్ వినిపిస్తోంది. పరిటాల కుటుంబానికి కంచుకోట వంటి ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా.. 2008లో ఏర్పడిన రాప్తాడులో పరిటాల కుటుంబానికి మంచి పట్టుంది. అందుకే.. 2009, 2014 ఎన్నికల్లో పరిటాల సునీత ఘన విజయం దక్కించుకున్నారు.
టీడీపీ హయాంలో మంత్రి పదవిని కూడా సునీత సొంతం చేసుకున్నారు. ఇక, అదే ఎన్నికల్లో రెండు సార్లు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపోటీ చేసినా.. పరాజయం పాలయ్యారు. 2009లో కాంగ్రెస్ తరఫున, 2014లో వైసీపీ తరఫున పోటీ చేశారు. ఇక, 2019లో మాత్రం సునీత తప్పుకొని పరిటాల వారసుడిని రంగంలోకి దింపారు. ఈ క్రమంలో ఇక్కడ పోరు తీవ్రంగా ఉంటుందని అంచనా వేసినా.. రెండు ఓడిపోయారన్న సెంటిమెంటుతో తోపుదుర్తికి ప్రజలు పట్టం కట్టారు.
అయితే.. తాజాగా ఇక్కడ ఏం జరిగింది? అనేవిషయాన్ని పరిశీలిస్తే.. నియోజకవర్గంలో పరిటాల హయాం లో వేసిన రహదారులే ఉన్నాయి. అప్పట్లో కట్టించిన మంచినీళ్ల ట్యాంకులు, వేసిన వ్యవసాయ బోర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎక్కడా మచ్చుకైనా.. ఈ నాలుగేళ్లలో అభివృద్ది కనిపించడం లేదు. ఈ విషయాన్ని తాజాగా ఎమ్మెల్యే తోపుదుర్తి కూడా అంగీకరించారు. తన అనుచరులతో రహస్యంగా నిర్వహించిన భేటీలో ఆయన తన హయాంపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
ఇక, క్షేత్రస్థాయిలోనూ ఎమ్మెల్యేపై వ్యతిరేకత కనిపిస్తోంది. పించన్లు, ఇతర సామాజిక పథకాల అమలు వంటి వాటిని నేరుగా ముఖ్యమంత్రి చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో తమ ఎమ్మెల్యే చేసింది ఏంటి? అని చూసుకుంటే.. ఏమీ కనిపించడం లేదని.. మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక, ఇక్కడ కూడా ఒక్క ఛాన్స్ ఇచ్చాం అనే మాటే వినిపిస్తోంది. వైసీపీ పరంగా కూడా తోపుదుర్తిని మార్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇక్కడ టీడీపీ గెలుపు తథ్యమని అంటున్నారు.