ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ దఫా టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని టీడీపీ నాయకులు సైతం చెబుతున్నారు. వీరికి అనేక అనుకూల అంశాలు కలిసి వస్తున్నాయ ని అంటున్నారు. ప్రధానంగా రాజధాని అంశం.. ఇక్కడ టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇటీవల కూడా రాజదాని రైతులు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చేందుకు అవసరమైన తొలి ఓటు గుంటూరులోనే పడుతుందని తేల్చి చెప్పారు.
అంటే.. గుంటూరులో రాజధాని గ్రామాల ప్రజలతోపాటు.. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారనేది ఖచ్చితంగా తెలుస్తోందని టీడీపీ నాయకులు అంటున్నారు. మరోవైపు.. అధికార పార్టీ వైసీపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలకు తోడు.. ఇప్పుడు నేతల్లో పెరిగిపోయిన.. అసం తృప్తులు కూడా పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. దీంతో పార్టీలో ఓట్ల చీలిక ఏర్పడితే.. అది కూడా తమకే అనుకూలంగా ఉంటుందని టీడీపీ తమ్ముళ్లు లెక్కలు వేస్తున్నారు.
ఉదాహరణకు సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, తాడికొండ, పెదకూరపాడు, వినుకొండ, గుంటూరు వెస్ట్ తదితర నియోజకవర్గాల్లో వైసీపీ నేతలే ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. పైగా.. ఇప్పుడున్న ఎమ్మె ల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తే.. (గుంటూరు వెస్ట్ టీడీపీ, తాడికొండలో ఇటీవల మార్పు జరిగింది) ఓడించి తీరుతామని కూడా చెబుతున్నారు. ఇక, చిలకలూరిపేటలో బహుశ ఈ సెగ కారణంగానే మంత్రిని మార్చేశారనే చర్చ సాగుతుండడం గమనార్హం.
మరోవైపు.. వినుకొండలో సొంత పార్టీ నేతలే.. వేరే నాయకురాలి(నన్నపనేని సుధ)ని తీసుకువచ్చారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటికి అడుగడుగునా సెగ, గుంటూరు వెస్ట్‌లో ఇటీవలే మార్పు చేశారు. అయినప్పటికీ.. అనుకున్న విధంగా అయితే.. వైసీపీ పరిస్థితి ఈ మూడు మాసాల్లో మారేలా లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో టీడీపీకి అనుకూలంగా ఓటెత్తడం ఖాయమని అంటున్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో టీడీపీ నాయకులు గెలిచే జిల్లాగా కూడా గుంటూరు ఉంటుందని తమ్ముళ్లు అంచనా వేస్తుండడం గమనార్హం.