తెలుగు దేశం పార్టీ…ఈ పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి హృదయం ఉప్పొంగుతుంది. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ….ఢిల్లీ కూసాలు కదిలించింది. తెలుగోడు తల్చుకుంటే ఢిల్లీ పీఠం దద్దరిల్లుతుందని…హస్తినాపురి పెద్దలకు అర’చేతి’లో చెమటలు పడతాయని చాటిచెప్పిన పార్టీ ఇది.
అన్నగారి మాట…సద్ది మూట అంటూ లక్షలాది మంది కార్యకర్తలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి పట్టం కట్టారు. 40 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన టీడీపీ…దక్షిణాదిలోని బలమైన ప్రాంతీయ పార్టీల్లో అగ్రస్థానంలో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఇదంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరగక ముందు సంగతి.
2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ…ఆంధ్రా వాళ్ల పార్టీ అన్న పాయింట్ ను తెలంగాణ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. విభజనానంతర సమస్యలు, ఆంధ్రా నుంచే పరిపాలన సాగించాలన్న నేపథ్యం, ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల టీడీపీ అధినేత చంద్రబాబు సహా టీడీపీలోని కీలకమైన నేతలంతా ఏపీకి తరలిరావడంతో తెలంగాణలో టీడీపీ బలహీనపడుతూ వచ్చింది.
టీఆర్ఎస్ అధికారంతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంతో…అది బలమైన పార్టీగా మారి మిగతా పార్టీలు బలహీనపడక తప్పని పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. టీఆర్ఎస్లో టీడీఎల్పీ విలీనం కావడంతో తెలంగాణలో టీడీపీ ప్రస్థానం దాదాపుగా ముగిసినట్లయింది.
టీడీపీ ఎమ్మెల్యేలు మచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్యలు టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీని విలీనం చేయాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ ఇచ్చారు. దీంతో, తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 40 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర పార్టీకి దూరంగా ఉంటున్నారు.
మచ్చా నాగేశ్వరరావు టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.. తాజాగా టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో టీడీపీకి శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వరావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థులుగా గెలిచారు.