ఏపీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న బీటెక్ రవి(రవీంద్రనాథ్ రెడ్డి) పాదయాత్రకు రెడీ అవుతున్నారు. నియోజకవర్గంలోని మొత్తం అన్ని మండలాల్లోనూ ఆయన పాదయాత్ర సాగించనున్నారు. ఎన్నికల సమయంలోపే.. ఈ యాత్ర ముగించేసి.. పార్టీ తరఫున జెండా పాతాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
ఇప్పటికి రవి అభ్యర్థిత్వం.. దాదాపు కన్ఫర్మ్ అయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్‌పై ఆయనే పోటీ చేయనున్నారని కూడా అంటున్నాయి. దీంతో సాధ్యమైనంత వరకు సింపతీని పోగు చేసుకోవడంతోపాటు.. స్థానిక సమస్యలపై యుద్ధం ప్రకటించడం ద్వారా వైఎస్‌కు, వైసీపీకి సానుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును తునాతునకలు చేయాలనేది బీటెక్ రవి వ్యూహం.
“ఇక్కడ గెలుస్తామనే అనుకుంటున్నాం. ఒకవేళ గెలుస్తామా ? లేదా ? అనే విషయాన్ని పక్కన పెట్టినా.. జగన్‌కు ఇక్కడ మెజారిటీని సాధ్యమైనంత వరకు తగ్గించాలని చూస్తున్నాం. ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నాం. పాదయాత్ర త్వరలోనే ఉంటుంది. బీటెక్ రవితోపాటు మండలస్థాయి నాయకులు కూడా పాల్గొంటారు“ అని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.
ఇటీవల బీటెక్ రవిని పోలీసులు అరెస్టు చేయడం.. జైల్లో పెట్టడం వంటి పరిణామాలు.. వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ ను పెంచాయి. ఇదేసమయంలో వివేకానందరెడ్డి హత్య కేసు విషయాన్ని టీడీపీ సీరియస్‌గా తీసుకుని.. ఆయన కుమార్తె కు అండగా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబంలో కూడా వ్యతిరేకత పెరిగిందని.. అది తమకు లాభిస్తుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఏదేమైనా.. గత ఎన్నికల్లో ఉన్నంత సానుకూలత ఇప్పుడు వైసీపీకి లేదని అంటున్నారు.