ఏపీలో జరగనున్న 2024 ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు టీడీపీ-జనసేన మిత్రపక్షం ఇప్పటికే వ్యూహాలు రెడీ చేసుకుంది. మిని మేనిఫెస్టోను ప్రజల్లోకి రిలీజ్ చేసింది. అయితే.. ఇవి కొన్ని వర్గాలకు మాత్రమే మేలు చేసేలా ఉన్నాయని అంతర్గత సమావేశాల్లో నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఇరు పార్టీలు.. అందరినీ మెప్పించేందుకు కీలకమైన నాలుగు అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఏపీకి రాజధాని లేదు. సో.. ఈ క్రమంలో అందరూ కొరుకుంటున్నది రాజధాని. దీనిని తొలి ప్రాధాన్య అంశంగా మార్చనున్నారు. వైసీపీ రాకముందే.. ఏపీ రాజధానిగా అమరావతిని అందరూ చెప్పుకొనేవారు. అయితే.. జగన్ వచ్చాక మూడు రాజధానుల పేరుతో అమరావతిని అటకెక్కించారు. పోనీ.. దీన్నయినా.. సాధించారా? అంటే లేదు. కానీ, రికార్డుల ప్రకారం ఇప్పటికే అమరావతే రాజధానిగా ఉందని కేంద్ర ఇటీవల కూడా చెప్పేసింది. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు.
ఇక, ఇసుక ధరల మోతతో ప్రస్తుతం రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం గడ్డు పరిస్తితిని ఎదుర్కొంటోంది. ఈ రంగంపై ఆధారపడి 70 శాతం మంది కార్మికులు జీవిస్తున్నారనే లెక్కలు ఉన్నాయి. మట్టి పనుల నుంచి కాంట్రాక్టు పనుల వరకు విద్యుత్ పనుల నుంచి ప్లంబింగ్ వర్క్ వరకు.. ఇలా 70 శాతం మంది దీనిపైనే ఆధారపడడంతో వారిని మచ్చిక చేసుకునేందుకు ఇసుక విధానాన్ని పేదలకు అనుకూలంగా తీసుకురా వాలని నిర్ణయించారు.
మూడో విషయం.. మద్యం. ఇది కొంత ఇబ్బందికరమే అయినా.. ప్రస్తావించకతప్పదని ఇరు పార్టీలూ నిర్ణయించాయి. మద్యనిషేధం చేయడం సాధ్యం కాదు కాబట్టి.. వైసీపీ అధినేత ఎన్నికలకు ముందు ఈ హామీ ఇచ్చికూడా విఫలమయ్యారు. దీంతో నిషేధం పక్కన పెట్టి ధరలను అదుపు చేయడం.. నాసిరకం మద్యాన్ని ఎత్తేయడం అనే రెండు అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టు ఇరు పార్టీల మధ్య చర్యలు జరిగాయి.
ఇక, నాలుగో విషయం.. ఉద్యోగులు, యువత. వీరికి సంబంధించిన కీలక విషయం.. సీపీఎస్ రద్దు.. అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ఈ అంశాన్ని ఒక ప్యాకేజీగా తీసుకుని.. అనుకూల నిర్ణయాలు తీసుకుని.. వారిని తమవైపుతిప్పుకోవాలన్నది టీడీపీ-జనసేన ప్లాన్. సీపీ ఎస్ రద్దు విషయంలోనే ముఖ్య నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో దీనిపై ఉద్యోగ సంఘాలతో ఈనెల చివరి వారంలో విజయవాడ, విశాఖల్లో భేటీలు నిర్వహించాలని నిర్ణయించారు.