మిచౌంగ్ తుఫాను బీభత్సానికి అతలాకుతలమైన ఏపీలోని పలు జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తు న్నారు. అయితే.. సాధారణంగా ముఖ్యమంత్రి వంటి రాష్ట్రాధినేత… బాధిత ప్రాంతాలకు వెళ్తే.. సాయం ప్రకటిస్తారని, తమ బాధలు తీరుతాయని బాధితులు ఆశిస్తారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఖజానాలో సొమ్ములు లేకపోవడం.. కేంద్రం ఇస్తానన్న 490 కోట్లు కూడా ఇంకా రాకపోవడంతో కేవలం పరామర్శలు.. ఓదార్పులకే ముఖ్యమంత్రి పరిమితమయ్యారు.
కేంద్ర ఆర్థిక శాఖ వర్గాల సమాచారం మేరకు ఏపీ, తెలంగాణల్లో మిచౌంగ్ తుపాను బాధితులను ఆదుకునేందుకు విపత్తు సహాయ నిధికింద కేంద్రం నిధులు విడుదల చేస్తామని చెప్పింది. అయితే.. ఇవి వచ్చేందుకు మరో నాలుగు రోజుల సమయం పట్టనుంది. అయితే.. అప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో పర్యటించకపోతే ఇబ్బంది ఏర్పడనుంది. మరోవైపు.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు బాధిత ప్రాంతాల్లో పర్యటనలకు రెడీ అయ్యారు.
దీంతో యుద్ధప్రాతిపదిక సీఎం జగన్ బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రధానంగా నామరూపాలు లేకుండా పోయిన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మిఛాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం, అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి, బాధితులను ఓదారుస్తున్నారు. అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లి బాధితులతో మాట్లాడతారు.
తర్వాత కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతును పరామర్శించనున్నారు. తర్వాత బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. అయితే.. సాయం ఇవ్వకుండా.. ఓదార్పు వచనాలతో తమ కష్టాలు తీరుతాయా? అనేది ఇక్కడిబాధితుల గోడు. అయినా.. ప్రతిపక్షాల కంటే ముందుగానే తాను ఓదార్చడం ద్వారా.. రాజకీయంగా ప్రాధాన్యం దక్కుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు.