ఒక పార్టీ నుంచి గెలవటం.. ఆ తర్వాత పార్టీ మారటం రాజకీయ నేతలకు ఒక అలవాటుగా మారటం తెలిసిందే. ఇలాంటి పార్టీ ఫిరాయింపుదారులకు తాజా ఎన్నికల్లో కాస్తంత గట్టి షాకే తగిలింది. అధికారమే పరమావధిగా మారి.. విలువల్ని పక్కన పెట్టేసి.. పార్టీ ఏదైనా పవర్ ఉంటే చాలు అనుకునే నేతలు ఇటీవల కాలంలో ఎక్కువైపోయారు. అధికారం చేతిలో లేకుండా ఐదేళ్లు ఉండటం అంత సులువైన విషయం కాదన్నట్లుగా నేతల మైండ్ సెట్ ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాజాగా వెల్లడైన ఫలితాల్ని చూస్తే.. పార్టీ ఫిరాయించి.. బీఆర్ఎస్ లో చేరిన వారిలో పలువురు ఓడారు. వారెవరంటే?
2018 ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ నుంచి కాకుండా వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేసి విజయం సాధించిన వారిలో 14 మంది గులాబీ కారు ఎక్కేశారు. తాజా ఎన్నికల్లో వారిలో 13 మందికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్లు ఇచ్చారు. అందులో ఏకంగా 11 మంది ఓడిపోవటం గమనార్హం. ఈ ఓటమిపాలైనవారిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.
2018లో టీడీపీ నుంచి విజయం సాధించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావులు ఓడిపోగా.. పినపాక నుంచి రేగ కాంతారావు.. ఇల్లందు నుంచి పోటీ చేసిన హరిప్రియ నాయక్.. కొత్తగూడెం నుంచి బరిలోకి దిగిన వనమా వెంకటేశ్వరరావు.. పాలేరునుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్ రెడ్డిలు కాంగ్రెస్ నుంచి కారు పార్టీలోకి చేరారు. వీరంతా బీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. వారంతా ఓడిపోయారు.
తాజా ఎన్నికల్లో ఓడిపోవటం ఒక ఎత్తు అయితే.. భారీ తేడాతో ఓటమి పాలు కావటం.. ప్రత్యర్థి అభ్యర్థులు గట్టి మెజార్టీతో విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే.. నకిరేకల్ నుంచి కారు అభ్యర్థిగా బరిలోకి దిగిన చిరుమర్తి లింగయ్య.. తాండూరు నుంచి బీఆర్ఎష్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పైలెట్ రోహిత్ రెడ్డిలు ఓడారు. వీరంతా కాంగ్రెస్ నుంచి గులాబీ కారు ఎక్కిన వారే.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్హాపూర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి.. కారు ఎక్కి.. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పపోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి.. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నుంచి ఇదే తరహాలో గులాబీ కారు బరిలో దిగిన జాజుల సురేందర్.. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డిలు తాజా ఎన్నికల్లో ఓడారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మిగిలిన వారికి భిన్నంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డి.. సుధీర్ రెడ్డిలు ఇద్దరు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం జంపింగ్స్ లో వీరిద్దరు మాత్రమే గెలుపొందటం ఆసక్తికరంగా మారింది.
ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గ్రేటర్ హైదరాబాద్ లోని వివిధ స్థానాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్ (రాజేందర్ నగర్).. మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్).. తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్ నగర్).. మాధవరం క్రిష్ణారావు (కుకట్ పల్లి).. అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి).. కేపీ వివేకానంద (కుత్భుల్లాపూర్)లు నాటి టీఆర్ఎస్ లో చేరి 2018లో ఎన్నికల్లో గులాబీ కారుపార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. తాజా ఎన్నికల్లోనూ వీరంతా గెలవటం ఆసక్తికరంగా మారింది.