తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం 67 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉండగా 2 స్థానాలలో విజయం సాధించింది. అశ్వరావుపేట, ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక, బీఆర్ఎస్ 36 స్థానాలలో లీడింగ్ లో ఉండడంతో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు అనధికారికంగా ఖాయం అయింది. మరోవైపు, కొడంగల్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 33వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్తి పట్నం నరేందర రెడ్డిపై 32800 ఓట్ల మెజారిటీ సాధించిన రేవంత్…పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 800 కలుపుకొని 33 వేల మెజారిటీ సాధఇంచారు. ఇక, కామారెడ్డిలో కూడా కేసీఆర్ పై రేవంత్ 300 ఓట్ల మెజారిటీలో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ డప్పులు వాయిస్తూ సంబరాలు జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డి నివాసానికి తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ చేరుకున్నారు. రేవంత్ రెడ్డితో భేటీ అయిన అంజనీ కుమార్ ఆయనకు ముందస్తుగానే శుభాకాంక్షలు తెలిపినట్టుగా తెలుస్తోంది. మరోవైపు, డీకే శివ కుమార్ తో కలిసి గాంధీభవన్ కు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకొని సీఎం సీఎం అంటూ..జై బాబు అంటూ నినాదాలు చేస్తున్నారు. అక్కడ టీడీపీ, కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి.
అంతకుముందు, రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయ్యారు. గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులు డిక్లరేషన్ తీసుకొని నేరుగా హైదరాబాద్లోని తాజ్ కృష్ణకు చేరుకోవాలని రేవంత్ కు డీకే సూచించినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు, చివరి రౌండు కౌంటింగ్ ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని, గెలుపు డిక్లరేషన్ తీసుకొని అధికారికంగా ఫలితం వెలువడిన తర్వాతే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావాలని ఆయన సూచించారట.
కాంగ్రెస్ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని, ఈ క్రమంలోనే అభ్యర్థులందరినీ కాపాడుకునే క్రమంలో ప్రతి అభివృద్ధితో పాటు ఎఐసిసి నుంచి ఒక నేతను ఉండేలాగా నియమించినట్టుగా తెలుస్తోంది. క్యాంప్ రాజకీయాలకు బీఆర్ఎస్ నేతలు తెరతీసే అవకాశముందని కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలని డీకే చెప్పినట్లు తెలుస్తోంది. గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులను ప్రలోభ పెట్టి బేరసారాలకు దిగేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించే చాన్స్ ఉందని డీకే చెప్పినట్లు తెలుస్తోంది.