ఫలితాలు తమకు అనుకూలంగా రాబోతున్నాయనే అంచనాలతో కాంగ్రెస్ క్యాంపు రాజకీయానికి రెడీ అయిపోతోంది. కాంగ్రెస్ తరపున పోటీచేసిన అభ్యర్ధులందరినీ క్యాంపుకు తరలించే ఏర్పాట్లు జరిగిపోయాయి. వీళ్ళందరినీ బెంగుళూరులోని ఫాం హౌస్ కు తరలించబోతున్నట్లు సమాచారం. పోలింగుకు ముందునుండే కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో పదేపదే చెప్పారు. దానికి తగ్గట్లే పోలింగ్ అయిపోగానే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ జోస్యాలు కూడా దాన్నే బలపరిచాయి.
సుమారు 20 సంస్ధలు ఎగ్జిల్ పోల్ సర్వేలను బయటపెడితే అందులో సుమారు 16 సంస్ధలు అధికారం కాంగ్రెస్ దే అని స్పష్టంగా చెప్పాయి. దాంతో అధికారంలోకి వచ్చే విషయంలో కాంగ్రెస్ లో బాగా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ జోస్యాలన్నీ తప్పులని అధికారంలోకి రాబోయేది తామే అని కేసీయార్, కేటీయార్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దాంతో ఒకరకంగా అయోమయం పెరిగిపోతోంది. దీంతో ఎందుకైనా మంచిదని కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలకు రెడీ అవుతోంది.
పోటీచేసిన అభ్యర్ధులతో ఇప్పటికే రేవంత్ ఈ విషయం చెప్పినట్లు సమాచారం. ప్రచారంలో బాగా కష్టపడిన వాళ్ళందరు ఓ రెండురోజులు విశ్రాంతి తీసుకోండని రేవంత్ చెప్పారట. ముందుగా ఇక్కడ పరిస్ధితిని అధిష్టానంతో మాట్లాడిన రేవంత్ క్యాంపు నిర్వహించాల్సిన అవసరాన్ని చెప్పారట. అందుకనే కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇదే విషయమై మాట్లాడేందుకు శనివారం హైదరాబాద్ వస్తున్నట్లు తెలిసింది. ముందుజాగ్రత్తగానే అభ్యర్ధులను క్యాంపులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారట.
ఎందుకంటే అధికారంలోకి వచ్చే విషయంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య టైట్ ఫైట్ మొదలైతే అప్పుడు ఎంఎల్ఏల ఫిరాయింపులు మొదలవుతాయి. ఇందులో కేసీయార్ బాగా ఆరితేరిపోయిన వారు. అందుకనే శనివారం రాత్రికల్లా క్యాంపుకు రెడీ చేయాలని కాంగ్రెస్ రెడీ అవుతోందట. ఆదివారం వచ్చే పలితాల్లో కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటి వస్తే ఇబ్బంది లేదు. అలాకాకుండా అటు ఇటుగా వస్తేనే సమస్యలు మొదలవుతాయని రేవంత్ భావిస్తున్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా క్యాంపు రాజకీయానికి రెడీ అవుతున్నది.