గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 23 నియోజకవర్గాల్లో (పటాన్ చెర్వును లెక్కలోకి తీసుకోవటం లేదు) ఏడు నియోజకవర్గాల్లో మజ్లిస్.. ఒక నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుంటే.. మిగిలిన 15 నియోజకవర్గాల్లో గులాబీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు భిన్నంగా గ్రేటర్ పరిధిలో గులాబీ కారు దూసుకెళుతుందన్న ప్రచారం జోరుగా సాగింది. కీలకమైన పోలింగ్ కు ఒక రోజు ముందుగా గ్రేటర్ లో పరిస్థితేంటి? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే.. గ్రేటర్ లో కారుకు చేజారే నియోజకవర్గాల లెక్క.. ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అవుతుందన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి గ్రేటర్ లో తిరుగులేని అధిక్యతలో ఉన్న బీఆర్ఎస్.. మజ్లిస్ పార్టీల బలం ఇప్పుడు ఎంత? ఎన్నినియోజకవర్గాల్లో బీజేపీ.. కాంగ్రెస్ లు పుంజుకున్నాయి? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
తాజాగా అందుతున్న సమాచారం ఆధారంగా చూస్తే.. సెటిలర్లు అధికంగా ఉండే మూడు శివారు నియోజకవర్గాల్లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈసారి మూడు స్థానాల్లో పట్టు నిలుపుకోవటం అంత తేలికైన విషయం కాదంటున్నారు. దీనికి తగ్గట్లే.. ఇక్కడి గులాబీ అభ్యర్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం మూడింటిలో రెండు స్థానాలు గులాబీ పార్టీ చేజారే వీలుందన్న మాట వినిపిస్తోంది.
సెంట్రల్ హైదరాబాద్ పరిధిలో తిరుగులేని అధిక్యతలో ఉన్న గులాబీ పార్టీకి ఈసారి ఇబ్బందికర పరిస్థితి ఉందంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి ఒక్క స్థానంలోనూ బలంగా లేని కాంగ్రెస్.. తాజాగా మాత్రం దగ్గర దగ్గర రెండు నుంచి మూడు స్థానాల్లో బలంగా ఉందంటున్నారు. అదే సమయంలో.. బీజేపీ సైతం రెండు స్థానాల్లో గట్టిపోటీ ఇస్తుందన్న మాట వినిపిస్తోంది.
ఇక.. గ్రేటర్ శివారుగా చెప్పే మరో నాలుగు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్.. బీజేపీలు గట్టి పోటీ ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అక్కడి గులాబీ అభ్యర్థులు గెలుపుకోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. గులాబీ సిట్టింగులున్న 15స్థానాలకు కాంగ్రెస్ ఆరేడు స్థానాల్లో అధిక్యతను ప్రదర్శిస్తుంటే.. బీజేపీ తనకున్న ఒక్క సిట్టింగ్ స్థానం కాకుండా మరో రెండు చోట్ల గట్టి పోటీని ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా గ్రేటర్ లో గులాబీ కారు స్పీడ్ కు బ్రేకులు పడే వాతావరణం ఉందన్న వాదన బలంగా వినిపిస్తుంది. మరి.. ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్నది చూడాలి.