బీఆర్ఎస్ ఆశలు ఆవిరి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులను పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు దక్కిన గోల్డెన్ ఛాన్స్ కాస్తా చేజారింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఇప్పుడు రైతుబంధు పథకం నిధుల జమకు బ్రేక్ వేసింది. బీఆర్ఎస్ విన్నతి మేరకు రైతుబంధును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు మొదట ఈసీ పచ్చజెండా ఊపింది.
కానీ వరుసగా సెలవులు రావడంతో ఈ నెల 28న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా రెండు రోజుల ముందు రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో నగదు బందు డబ్బులు జమ అయితే.. ఓట్లన్నీ గంప గుత్తగా తమకే దక్కుతాయని బీఆర్ఎస్ ఆశ పెట్టుకుంది. ఇదిగో డబ్బులు వచ్చేస్తున్నాయని కూడా ఆ పార్టీ నాయకులు చెప్పారు. 70 లక్షల రైతులు ఖాతాల్లో రూ.7 వేల కోట్లకు పైగా వేసే ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమైంది.
కానీ ఈసీ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్ కే మేలు చేసేలా ఈసీ నిర్ణయం తీసుకుందంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని మరోసారి బయటపడిందనే విమర్శలు వినిపించాయి. దీంతో ఈసీ ఆలోచనలో పడింది. రైతుబంధు నిధుల పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. అంతే కాదు కాంగ్రెస్ కారణంగానే రైతుబంధు ఆగిపోయిందని, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు జమ చేస్తోందని మంత్రి హరీష్ రావు సభలో చేసిన వ్యాఖ్యలను ఈసీ పరిగణలోకి తీసుకుంది. ఇది బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుందని భావించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇప్పుడేమో కాంగ్రెస్ కారణంగానే ఈసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.