నవ్యాంధ్రలో వచ్చే ఎన్నికల్లో రెండోసారి గెలిచేందుకు దారులు మూసుకుపోతుండడంతో.. టీడీపీ ఓట్ల తొలగింపు ద్వారా లబ్ధిపొందేందుకు జగన్ పార్టీ వైసీపీ నానా రకాల అడ్డదారులు తొక్కుతోంది. ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచి, ఎన్నికల వ్యవహారాల నుంచి వ్యూహాత్మకంగా టీచర్లను దూరం చేసి.. ఏరికోరి నియమించుకున్న సచివాలయాల సిబ్బందికి ఆ బాధ్యత కట్టబెట్టింది. బూత లెవల్ అధికారు(బీఎల్వో)లుగా వారినే నియమించింది.
ఎవరు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారో.. ఎవరు టీడీపీకి ఓటేస్తారో ముందే ఆరా తీసిన వార్డు వలంటీర్లు.. ఇప్పటికే వైసీపీ నాయకత్వానికి సమాచారమిచ్చారు. దాంతో ప్రభుత్వం బీఎల్వోల వెంట వలంటీర్లను పంపి.. ఓటర్ల తనిఖీ చేయిస్తోంది. యథేచ్ఛగా టీడీపీ, ఇతర విపక్షాల మద్దతుదారుల ఓట్లను తొలగిస్తోంది. జీరో నంబరు డోర్‌పై దొంగ ఓటర్లను నమోదు చేయిస్తోంది. రాష్ట్రంలో 26 లక్షలకుపైగా దొంగ ఓట్లు ఉన్నాయని సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల సంఘమే ప్రకటించిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఓట్ల తొలగింపునకు ఓ ప్రక్రియ ఉంటుంది. ఫారం-7 దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఐదుకు మించి ఈ దరఖాస్తులు ఇవ్వడానికి వీల్లేదు. కానీ వైసీపీ కార్యకర్తలు ఒక్కొక్కరు వందలేసి దరఖాస్తులు ఇచ్చేస్తున్నారు. వీటిపై బీఎల్వోలు స్థానిక వైసీపీ నేతల ఇంట్లో సమావేశమై.. ఓట్లు తొలగించాలని జిల్లా ఎన్నికల అధికారులకు పంపుతున్నారు. పై స్థాయి ఒత్తిళ్లతో వారూ తీసేస్తున్నారు. దీనిపై టీడీపీ నాయకత్వం అప్రమత్తమైంది. బీఎల్వోల అక్రమ చర్యలను ఎక్కడికక్కడ నిలదీయాలని.. వీడియోలు తీసి ఈసీకి పంపాలని కార్యకర్తలను ఆదేశించింది.
వారు ప్రతి రోజూ అదే పనిపై ఉంటున్నారు. దీంతో ఓట్ల తొలగింపు పాచిక పారదన్న భయంతో.. టీడీపీ కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతీయడానికి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించింది. దీనిని ముందుగానే పసిగట్టిన టీడీపీ అధిష్ఠానం.. అక్రమ అరెస్టుకు నిరసనగా ఆందోళనల్లో పాల్గొంటున్నప్పటికీ ఓట్ల ఏరివేతను అడ్డుకోవలసిందేనని కార్యకర్తలను ఆదేశించింది. దాంతో వారు మరింత క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రభుత్వ పెద్దలకు మింగుడుపడడం లేదు.
కావలిలో ఈ రోజుల్లో 9 వేల దరఖాస్తులు..
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఇటీవల కేవలం రెండు రోజుల్లో తొమ్మిది వేల ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు రావడం గమనార్హం. ఇందులో అత్యధిక భాగం అధికార పార్టీ నేతల నుంచే వచ్చాయని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అడ్డగోలుగా ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు పెడుతున్న వారిపై ఎన్నికల కమిషన్ కేసులు పెడుతున్నా వీటి ఉఽధృతి తగ్గకపోవడం విశేషం. సెలవు రోజుల్లో ఎన్ని దరఖాస్తులు పెట్టినా ప్రత్యర్థి పార్టీలు పట్టించుకోవన్న ధీమాతో ఆ సమయంలో వీటిని దాఖలు చేస్తున్నారని అంటున్నారు.
ఒకే వ్యక్తి ఐదుకు మించిన ఓట్లను తొలగించాలని దరఖాస్తు పెడితే వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, తొందరపడి ఆమోదించవద్దని ఎన్నికల కమిషన్ గతంలో ఆదేశాలు జారీ చేసింది. కానీ కావలిలో దీనిని కూడా పట్టించుకోకుండా ఎడాపెడా దరఖాస్తులు పెడుతున్నారు. ఒకే వ్యక్తి ఐదుకు మించి ఓట్ల తొలగింపునకు ఇచ్చిన దరఖాస్తులు 500కు పైగా ఉన్నాయి. దీనికి ముందు ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. ఈ నియోజకవర్గంలో ఏకంగా 17 వేల ఓట్ల తొలగింపునకు ఫారం-7 కింద దరఖాస్తులు అందాయి.
దీనిపై పరుచూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈసీ తప్పుడు దరఖాస్తులు పెట్టిన వారిపై పోలీసు కేసులు పెట్టాలని కింది స్థాయి అధికారులను ఆదేశించింది. తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో కూడా 9వేల ఓట్ల తొలగింపునకు అధికార పార్టీ నేతల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఏకపక్షంగా ఓట్లు తీసేస్తే సహించేది లేదని అక్కడి టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేయడంతో కింది స్థాయి అధికారులు ఇరుకునపడ్డారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో భారీగా ఓట్లను చేర్చే ప్రయత్నం జరుగుతోంది. కొత్త ఓట్ల చేర్పునకు ఏకంగా 31 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇన్ని దరఖాస్తులు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో రాలేదు. ఈ వ్యవహారం ఆ నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ యుద్ధంగా పరిణమించింది. వచ్చిన వాటిలో పది వేల దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. 14వేల దరఖాస్తులను తిరస్కరించారు. బతికిఉన్నా చనిపోయారంటూ టీడీపీ ఓట్లను తీసివేస్తున్నారు. దీనిపై జనం ఆందోళనకు దిగుతుండడంతో ఈసీ తలపట్టుకుంటోంది. దీనిపై వైసీపీ పెద్దలు ఎదురుదాడికి దిగుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ 60 లక్షల దొంగ ఓట్లను నమోదు చేయించిందని.. వాటినే తాము తీసివేయిస్తున్నామని బుకాయిస్తోంది. నిజంగా 60 లక్షల దొంగ ఓట్లు చేర్పించి ఉంటే వైసీపీ ఆ ఎన్నికల్లో నిజంగా గెలిచేదా?